
దీనిపై త్వరలో రాష్ట్రపతిని కలుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తాండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తాండూరు: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ విషయమై త్వరలోనే మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నట్లు చెప్పారు. బీసీ బిల్లు ఆమోదాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కేంద్రానికి సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి భట్టి మంగళవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం పట్టణ శివారులోని జీపీఆర్ గార్డెన్‌లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లపాటు ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో విసిగిపోయిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించామన్నారు.
95 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం
రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకుగాను 95 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రేషన్ కార్డు కలిగిన వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తున్నామని భట్టి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఇందిరమ్మ పథకం కింద పేదలకు సొంత ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు మంజూరు చేశామన్నారు.
పేద విద్యార్థుల దశదిశ మారుతుంది
యాలాల మండలం దౌలాపూర్ శివారులో రూ. 250 కోట్ల నిధులతో నిర్మించనున్న ఇంటిగ్రేటేడ్ స్కూల్ భవన నిర్మాణానికి భట్టి శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 104 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. పోటీ ప్రపంచంలో నిలబడేలా ఇందులో విద్యార్థులను తీర్చిదిద్దుతామని.. తద్వారా పేద, బలహీన వర్గాల విద్యార్థుల దశ, దిశ మారుతుందన్నారు. తాండూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ సీఎం చెన్నారెడ్డి, మాణిక్‌రావు, చంద్రశేఖర్‌రావు వంటి వారు తమదైన ముద్రవేశారని గుర్తుచేశారు.
కాన్వాయ్ ఆపి.. చిరు వ్యాపారిని పలకరించి..
ధారూరు: తాండూరు పర్యటన ముగించుకొని మంగళవారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళ్తున్న డిప్యూటీ సీఎం భట్టి ధారూరు మండలం అనంతగిరి చివరి గుట్ట వద్ద తన కాన్వాయ్‌ను ఆపి మొక్కజొన్న కంకులు విక్రయిస్తున్న మహ్మద్ చాంద్ వద్దకు వెళ్లి కంకులు కొనుగోలు చేశారు. రోజుకు ఎంత సంపాదిస్తావని అతన్ని అడగ్గా కూలీ సైతం గిట్టడం లేదని చాంద్ ఆవేదన వ్యక్తంచేశాడు. దీనిపై స్పందించిన భట్టి మీలాంటి చిరు వ్యాపారులకు త్వరలోనే ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.