రాష్ట్రానికి డెంగీ ముప్పు

Dengue surveillance in 28 hospitals of Telangana - Sakshi

ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 961 కేసులు నమోదు.. ఆగస్టు నెలలో రోజుకు సరాసరి వంద కేసులు  

రాష్ట్రంలోని 28 ఆసుపత్రుల్లో డెంగీపై సర్వైలెన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో అంటే జూలై వరకు రాష్ట్రంలో 961 డెంగీ కేసులు నమోదు కాగా, ఆగస్టు నెలలో సరాసరి రోజుకు వంద మందికి పైగా డెంగీ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేశాయి.

ఇక ఈనెల సెప్టెంబర్‌ మూడు నాలుగు వారాల్లో డెంగీ కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందనీ, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెంగీ కారక దోమ వృద్ధి చెందుతోందని చెబుతున్నారు. ప్రజలు పగటి పూట దోమ కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోకుంటే డెంగీ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీపై సర్వైలెన్స్‌ 
డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వైలెన్స్‌  వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా ఆసుపత్రుల్లో డెంగీపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తారు. ఆసుపత్రుల పరిధిలోని ప్రాంతాల్లో రక్త నమూనాలు సేకరించి వాటిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు పంపిస్తారు. దీనివల్ల దేశంలో ఎక్కడెక్కడ డెంగీ తీవ్రత ఉందో అంచనా వేస్తారు. ఆ మేరకు చర్యలు చేపడతారు. 

విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి 
డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్‌లెట్‌ కౌంట్, డెంగీ స్ట్రిప్‌ టెస్ట్, సీరమ్‌ టెస్ట్‌ వంటి వాటితో దీనిని నిర్థారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలని స్పష్టం చేస్తోంది. ప్లేట్‌లెట్లు 50 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు.

15 వేల కన్నా తగ్గితే కొన్నిసార్లు డెంగీ మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎల్రక్టాల్‌ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్‌లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top