హైకోర్టులోనూ జడ్జీల సంఖ్య పెంచాలని డిమాండ్
నిరంతరం 20 నుంచి 30 శాతం ఖాళీలు
ఎన్‌సీఎల్‌టీ, క్యాట్.. తెలుగు రాష్ట్రాల కేసులన్నీ హైదరాబాద్‌లోనే..
అయినా జడ్జీల సంఖ్య పెంపులో జాప్యం
సుప్రీంకోర్టులో పెంపు నేపథ్యంలో జడ్జీల సంఖ్య అంశం తెరపైకి..
సాక్షి, హైదరాబాద్: తీవ్ర పని భారం వల్ల సత్వర న్యాయం అందించలేని స్థితిలో న్యాయస్థానాలు విధులు నిర్వహిస్తున్నాయి. జనాభాకు సరిపడా జడ్జీలు లేక కేసుల ఒత్తిడితో వారు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోర్టు విచారణ సమయం తర్వాత కూడా తీర్పులు డిక్టేషన్ చేయడం, మరలా వాటిలో తప్పొప్పులను పరిశీలించి సరిచేయడం.. ఇలా పనిభారంతో సతమతం కావాల్సి వస్తోంది. సెలవు రోజుల్లో విచారణ కొనసాగించకున్నా.. ఇతర పనులు తప్పడం లేదు. వాదనల నమోదు, గత తీర్పుల విశ్లేషణ.. అనంతరం తాజా కేసుల్లో తీర్పు రాయడం.. ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మరోవైపు ప్రజలు తమ కేసుల విచారణ పూర్తికాక ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొత్తగా పోస్టుల సంఖ్య పెంపు మాటేమోగానీ.. మంజూరైన వాటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం.. నిరంతరం 20 నుంచి 30 శాతం ఖాళీలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెంచిన నేపథ్యంలో హైకోర్టులోనూ జడ్జీల సంఖ్య కూడా పెంచాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. అదీగాక ఇరురాష్ట్రాల ఎన్‌సీఎల్‌టీ, క్యాట్ ఇక్కడే ఉండటంతో బెంచ్‌లు సరిపోవడం లేదనే అభిప్రాయం కూడా ఉంది.

సరిపడా జడ్జీలు లేకుంటే సమస్యలివీ..
⇒ కోర్టుల్లో పేరుకుపోయే కేసుల భారం
⇒ న్యాయవ్యవస్థపై పెరుగుతున్న పని ఒత్తిడి
⇒ సామాన్యుడికి ‘న్యాయం’అందేందుకు ఏళ్లకు ఏళ్లు
⇒ కోర్టుల్లో సత్వర న్యాయం దక్కేందుకు అవకాశం లేకపోవడం

తెలంగాణలోనూ జడ్జీల సంఖ్య పెంచాలి
జడ్జీల సంఖ్య జనాభాకు సరిపడా లేకపోవడంతో కేసుల పెండింగ్ రేటు అంతకంతకు పెరిగిపోతోంది. హైకోర్టులో విభజన సమయంలో మంజూరైన పోస్టులే తప్ప.. ఇప్పటివరకు పెంచలేదు. అందులోనూ ఖాళీలతో కక్షిదారులు, న్యాయవాదులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. హైకోర్టుతోపాటు ఇతర కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి.. సత్వర న్యాయానికి ప్రభుత్వాలు దోహదం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు ఆ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలి. –హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్.సురేందర్‌రెడ్డి
దేశంలో పెండింగ్ కేసులు 5 కోట్లకుపైగా ఉన్నాయి. ఇందులో దశాబ్దాల కేసులు కూడా ఉండటం ఆశ్చర్యకరం. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజీ) ఈ ఆలస్యానికి కారణాలను అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏడు ప్రధాన కారణాలు ఇలా..
న్యాయవాది అందుబాటులో లేక..: 59,72,394
నిందితుడు పరారీలో: 34,17,009
సాక్ష్యం కారణంగా: 25,79,442
స్టే కారణంతో: 20,62,339
డాక్యుమెంట్ల కోసం: 13,74,611
కక్షిదారుల నిరాసక్తత: 7,35,127
పదేపదే అప్పీళ్లు: 4,29,373


