వైరస్‌ టెన్షన్‌!.. తారస్థాయిలో విరుచుకుపడుతున్న థర్డ్‌వేవ్‌

Delta and Omicron Variants Are Suffocating The Greater Inhabitants - Sakshi

సాక్షి హైదరాబాద్‌: ఊహించినట్లే జరుగుతోంది. గ్రేటర్‌లో థర్డ్‌వేవ్‌ తారస్థాయికి చేరుతోంది. ఒకవైపు డెల్టా.. మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్‌లు గ్రేటర్‌వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క్రిస్మస్, డిసెంబర్‌ 31 వేడుకల తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదువుతుండటం, చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్, మే, జూన్‌ మాసాల్లో తారస్థాయికి చేరిన కేసులు.. ఆగస్టు తర్వాత తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్‌ మూడో వారం నుంచి మళ్లీ కేసుల సంఖ్య పెరుతూ వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో మూడు రోజుల క్రితం.. 397 పాజిటివ్‌ కేసులు నమోదైతే.. తాజాగా బుధవారం ఒక్కరోజే 1,285 మందికి వైరస్‌ నిర్ధారణ కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.     

హెచ్చరికలు బేఖాతరు..  

 • కోవిడ్‌ టీకాలు అందుబాటులోకి రావడంతో పాటు వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఆగస్టు నుంచి కోవిడ్‌ ఆంక్షలను సడలిస్తూ వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెప్టెంబర్‌ నుంచి  దశలవారీగా విద్యా సంస్థలను పునఃప్రారంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు సినిమా థియేటర్లు, పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి.  
 • కోవిడ్‌ నిబంధనల మేరకు రోజువారీ పనులు కొనసాగించాలని వైద్యులు సూచించినప్పటికీ.. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్నామనే ధీమాతో వాటిని పూర్తిగా విస్మరించారు. వైద్యనిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగలు, పబ్బాల పేరుతో 
 • విందులు, వినోదాల్లో మునిగి తేలారు.  
 • రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు సభలు, సమావేశాలకు వచ్చిన కార్యకర్తలు సైతం మాస్కులను విస్మరించారు. భౌతిక దూరం అనే అంశాన్ని పూర్తిగా మరిచిపోయారు. శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోకపోవడం వల్ల వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరించింది. 

మచ్చుకు కొన్ని కేసులు ఇలా.. 

 • మెయినాబాద్‌ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడలోని ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల టెన్నిస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న వందమంది క్రీడాకారుల్లో ఇటీవల చెన్నైలో జరిగిన టెన్నిస్‌ పోటీలకు  40 మంది హాజరై వచ్చారు. వీరిలో స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నేషనల్‌ స్కూలు విద్యార్థులు కూడా ఉన్నారు. టోర్నమెంట్‌కు వెళ్లి 
 • వచ్చిన తర్వాత వీరిలో ఆరుగురు క్రీడాకారులకు దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. మూడు రోజుల క్రితం వీరికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వీరిలో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో శిక్షణ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. స్కూలు యాజమాన్యం కూడా ఆఫ్‌లైన్‌ క్లాసులను రద్దు చేసి, ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తోంది.  
 • నాదర్‌గుల్‌ సమీపంలో నివాసం ఉంటున్న డీఆర్‌డీఓకు చెందిన ఓ కీలక అధికారి ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయనను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. అప్పటికే ఆయనకు సన్నిహితంగా తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు మెలగడంతో ఆ తర్వాత వారికి కూడా వైరస్‌ సోకింది. వైరస్‌ నిర్ధారణ అయినప్పటికీ.. లక్షణాల తీవ్రత పెద్దగా లేకపోవడంతో వారంతా హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకున్నారు. 
 • శంషాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్‌ వెళ్లి వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ర్యాండమ్‌ చెకప్‌లో భాగంగా ఆయన నుంచి నమూనాలు సేకరించి, పరీక్షించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆ తర్వాత జరిపిన జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు తేలింది. అప్పటికే ఆయన ఇంటికి చేరుకోవడం, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడం వల్ల ఆయన ద్వారా ఆయన కుమారునికి, ఇతర కుటుంబ సభ్యులకు వైరస్‌ నిర్ధారణ అయింది. 

కోర్‌సిటీ కంటే.. శివారు ప్రాంతాల్లోనే..  

 • నిజానికి ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ పూర్తిగా కోర్‌ సిటీకే పరిమితమైంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల మున్సిపాలిటీలకు, మారుమూల గ్రామాలకు విస్తరించింది. సిటీ నుంచి శివారు ప్రాంతాలకు రాకపోకలు పెరిగింది. దీంతో పాటు వైరస్‌ శివారు ప్రాంతాలకు విస్తరించింది. సిటిజన్లతో పోలిస్తే.. శివారు బస్తీవాసుల్లో వైరస్‌పై సరైన అవగాహన లేదు. ఓ వర్గం ప్రజల్లో టీకాలపై ఇప్పటికీ మూఢ నమ్మకం నెలకొంది. దీనికి అపోహ తోడైంది. ఇప్పటికీ చాలా మంది టీకాలు వేసు కోకుండా దూరంగా ఉండిపోయారు. టీకా వేసుకోక పోవడానికి తోడు వీరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వీరు త్వరగా వైరస్‌ బారిన పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.  
 • ఫంక్షన్‌ హాళ్లు, ప్రముఖ హోటళ్లు, ఐటీ అనుబంధ సంస్థలన్నీ ఓర్‌ఆర్‌ఆర్‌కు అటూఇటుగా విస్తరించి ఉండటం, ఇక్కడికి రాకపోకలు ఎక్కువగా జరుగుతుండటం కూడా రికార్డు స్థాయిలో కేసుల నమోదుకు మరో కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ నిర్ధారణ అయిన వారిలో పెద్దగా లక్షణాలు కన్పించకపోవడం, ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించి, కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించకపోవడం, ఈ విషయం తెలియక ప్రజలు తరచూ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తుండటం, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిపై నిఘా కూడా లేకపోవడం, మందులు, కాయకూరలు, నిత్యవసరాల కొనుగోలు పేరుతో వీరంతా సాధారణ పౌరుల్లా బయట తిరుగుతుండటం కూడా ఆయా ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటానికి కారణ మ ని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
 • ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచే కాదు.. సరిహద్దు రాష్ట్రాల బాధితులు చికిత్స కోసం ఇక్కడికే వస్తున్నారు. వీరికి సహాయంగా వచ్చిన వారు ఆస్పత్రి ఆవరణలో సాధారణ రోగుల మధ్య తిరుగుతున్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top