నత్తనడకన మెడికల్‌ ప్రవేశాలు

Delay In MBBS and BDS Medical Admissions Process - Sakshi

ప్రకటన వచ్చి మూడు వారాలైనా మొదలుకాని వెబ్‌ ఆప్షన్లు

ధ్రువపత్రాల ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌లో సంక్లిష్టత

ఎస్సీ,ఎస్టీలకూ ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు ఇస్తున్న తహసీల్దార్లు

28 నుంచి వెబ్‌ ఆప్షన్లకు సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ మెడికల్‌ అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ప్రవేశాలకు ప్రకటన వెలువడి దాదాపు 3 వారాలు పూర్తయినా ఇప్పటికీ వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆలిండియా కోటాలో మొదటిదశ ప్రవేశాలు పూర్తయ్యాయి. ఆలిండి యా కోటాలో మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన వెంటనే, రాష్ట్రంలోనూ మొదటి విడత ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇవ్వాలి. ఈసారి మాత్రం తీవ్రమైన జాప్యం జరుగుతోంది. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ విద్యార్థుల సమక్షంలో జరగ్గా, ఇప్పుడు కరోనా కారణంగా ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌ జరుగుతోంది. దీంతో విద్యార్థులు ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేయలేదంటున్నారు. చాలావరకు తప్పుల తడకగా ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాల్లోనూ అనేక తప్పులు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని కులాలు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉంటాయి. కానీ కొందరు సంబం ధిత జిల్లాలో లేని కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కేటగిరీలో ధ్రువపత్రాల్లోనూ తప్పులు ఉన్నాయి. 

కొందరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కూడా ఈడబ్లు్యఎస్‌ ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేశారు. వారికి ఈడబ్లు్యఎస్‌కు సంబంధం లేకున్నా తహసీల్దార్లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు ఉండాల్సి ఉండగా, రూ.10 లక్షలకు పైగా ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు కొందరు ఈడబ్ల్యూఎస్‌ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇటువంటి వాటిని గుర్తించి, విద్యార్థులకు ఫోన్లు చేసి చక్కదిద్దడానికి ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. (చదవండి: ఎంబీబీఎస్‌ రాక.. బీడీఎస్‌ ఇష్టం లేక..)

28 నుంచి వెబ్‌ ఆప్షన్లు...
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ ఆప్షన్లను ఈ నెల 28 నుంచి నిర్వహించడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యే అవకాశాలున్నాయని, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హుల జాబితాను ప్రకటిస్తారు. జాబితాపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించడానికి మరో రెండ్రోజులు సమయం తీసుకుంటారు. అనంతరం మెడికల్‌ కాలేజీని ఎంచుకోవడానికి వచ్చే సోమవారం నుంచి విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నెలాఖరులో మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడిస్తామని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. కన్వీనర్‌ కోటాలో తొలివిడత పూర్తయిన తర్వాత ప్రైవేటు వైద్యకళాశాలల్లో మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటాలో సీట్ల భర్తీకి ప్రకటన జారీచేస్తారు. (చదవండి: పక్కింటి పద్మావతితో ప్రేమాయణం.. 14 ఏళ్ల తర్వాత డాక్టర్‌గా)

రెండో విడత ప్రవేశాలు..
ఆలిండియా మెడికల్‌ ప్రవేశాల్లో రెండో విడత శుక్రవారం నుంచి నిర్వహిస్తారు. ఈ నెల 24 వరకూ రెండో విడతలో వెబ్‌ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 27న సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడిస్తారు. 28 నుంచి వచ్చే నెల 8లోగా కేటాయించిన మెడికల్‌ కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాల వల్ల అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం జరుగుతుందని కాళోజీ నారాయణరావు హెల్త్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top