
నిమ్స్‌లో బాధితురాలిని పరామర్శిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆరుకు చేరిన మృతుల సంఖ్య
ఆస్పత్రుల్లో 32 మందికి చికిత్స
వీరిలో నలుగురి పరిస్థితి విషమం
కల్లు దుకాణం నిర్వాహకుల అరెస్టు
బాధితులను పరామర్శించిన మంత్రి జూపల్లి
కూకట్‌పల్లి/ లక్డీకాపూల్/ సాక్షి, హైదరాబాద్: కల్తీ కల్లు మృతులు, బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. కూకట్‌పల్లి, హైదర్‌నగర్ కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు సేవించినవారిలో మూడు రోజుల క్రితం ఇద్దరు మరణించగా, బుధవారం మరో నలుగురు మృతిచెందారు. బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి వరకు 31 మంది నిమ్స్‌లో, రామ్‌దేవ్‌రావ్ ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కల్తీ కల్లు తాగి బొజ్జయ్య, నారమ్మ అనే వ్యక్తులు సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం సీతారాం (47) అనే వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. హైదర్‌నగర్‌కు చెందిన స్వరూప (61) సాయంత్రం 4 గంటలకు మృతి చెందగా, సాయిచరణ్ కాలనీకి చెందిన మౌనిక (24) సాయంత్రం 6 గంటలకు మరణించింది. రాత్రి 8 గంటలకు నారాయణ అనే వ్యక్తి రామ్‌దేవ్ రావ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గాంధీ ఆస్పత్రిలో చేరిన విజయ్, కృష్ణయ్య అనే బాధితులను మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించినట్లు గాంధీ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్‌కుమార్ తెలిపారు. నిమ్స్‌లో మోహనప్ప, పెంటయ్య, యాదగిరి, రాములు అనే బాధితులు ఇప్పటికే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మాధవి, యోబు, నర్సింహ, దేవదాసు, గోవిందమ్మ, లక్ష్మీ, కోటేశ్వరరావు, పోచమ్మ,ప్రమీల తదితరులకు వైద్యం అందిస్తున్నట్లు నిమ్స్ వర్గాలు తెలిపాయి.
కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు: జూపల్లి
రాష్ట్రంలో కల్తీ కల్లు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. బుధవారం ఆయన ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కల్తీ కల్లు సరఫరా చేసినవారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కల్తీ కల్లును పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామని, నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. బాధితుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, మిగతావారు కోలుకుంటున్నారని నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డా.ఎంవీఎస్ సుబ్బలక్ష్మి తెలిపారు. బాధితులను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఐదుమంది అరెస్టు
కల్తీ కల్లు ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు మేడ్చల్ జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ షాన్‌వాజ్ ఖాసిం తెలిపారు. దుకాణాల నిర్వాహకులు నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్‌గౌడ్, టి.శ్రీనివాస్‌గౌడ్, టి.కుమార్‌గౌడ్, తీగల రమేశ్‌లను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసినట్లు చెప్పారు. హెచ్‌ఎంటీ కాలనీ, హైదర్‌నగర్, ఎస్పీనగర్ కల్లు దుకాణాలను సీజ్ చేశారు. కూకట్‌పల్లి, హైదర్‌నగర్ కల్లు కాంపౌండ్‌లో లభించిన 674 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నారు. మృతులు స్వరూప కుమారుడు, సీతారాం భార్య కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.