
ఆర్టీఏ పదోన్నతుల్లో ప్రతిష్టంభన
ఆరు నెలలుగా ఇన్‌చార్జిల పాలన
సిబ్బందికి, ఎంవీఐలకు మధ్య కొరవడిన సమన్వయం
కొన్నిచోట్ల అధ్వానంగా రవాణా కార్యకలాపాలు
బహిరంగంగానే ఏజెంట్ల ‘వ్యవహారాలు’
అసిస్టెంట్లకు అడ్డాలుగా మారిన కార్యాలయాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో పదోన్నతులపై ప్రతిష్టంభన నెలకొనడంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఆరు నెలలకుపైగా ఇన్‌చార్జుల ఏలుబడిలో కొనసాగుతున్నాయి. దీంతో పౌరసేవల నిర్వహణలో వివిధ విభాగాల మధ్య సమన్వయం కొరవడింది. పరిపాలన అధికారులు, ఉద్యోగులకు, మోటారు వాహన తనిఖీ ఇన్‌స్పెక్టర్లకు నడుమ సమన్వయం లేకపోవడంతో పలుచోట్ల డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్లు, బదిలీలు, ఫిట్‌నెస్ పరీక్షలు, యాజమాన్య బదిలీ వంటి పలు సేవల్లో వాహన వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు అన్ని చోట్ల ఏజెంట్ల కార్యకలాపాలు బహిరంగంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అసిస్టెంట్లకు అడ్డాలుగా..
వాహనదారులు ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదు చేసుకొని ఫీజులు చెల్లించినప్పటికీ లెర్నింగ్ లైసెన్సులు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్ల కోసం ఆర్టీఏ కార్యాలయాలకు స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏజెంట్ల ద్వారా వచ్చే ఫైళ్లు సత్వరమే పరిష్కారమవుతుండగా, స్వయంగా వెళ్లే వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలు మధ్యవర్తులకు ప్రధాన అడ్డాలుగా మారాయి.
జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు నిర్వహించాల్సిన విధుల్లో వాళ్లకు అసిస్టెంట్లుగా వ్యవహరించే దళారులే స్వయంగా ఆఫీసుల్లో తిష్టవేసి పనులు కానిస్తున్నారని హబ్సిగూడకు చెందిన ఓ వాహనదారు విస్మయం వ్యక్తం చేశారు. ఆర్టిఓలు విధులు నిర్వహించే చోట ఇలా ఏజెంట్లు నేరుగా కార్యాలయాల్లో పాగా వేసే పరిస్థితి లేదు. ప్రాంతీయ రవాణా అధికారుల పర్యవేక్షణ లేని కొన్ని కార్యాలయాల్లో ఇష్టారాజ్యంగా మారింది.
కొర్రీలతో బెంబేలెత్తించి..
మరోవైపు కొన్ని రవాణా కేంద్రాల్లో దళారుల ప్రమేయం లేకుండా వెళ్లే వాహనదారులను సిబ్బంది రకరకాల కొర్రీలు పెట్టి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇటీవల కూకట్‌పల్లి యూనిట్ కార్యాలయంలో కొత్త ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా వెళ్లిన వ్యక్తిని సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వాహనానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు సహా దరఖాస్తు స్వీకరించి రసీదు అందజేసి.. నాలుగు రోజులైనా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో సదరు వాహనదారు అధికారులను సంప్రదించారు.
చిరునామా ధ్రువీకరణ కోసం విద్యుత్ బిల్లు, అఫిడవిట్ వంటి ఆధారాలను అందజేసినప్పటికీ మ్యారేజ్ సర్టిఫికెట్ జత చేస్తే తప్ప ఫైల్‌ను అప్రూవల్ చేయలేమని చెప్పడంతో సదరు వాహనదారు విస్తుపోయారు. సాధారణంగా దళారుల ద్వారా వస్తే ఇలాంటి డాక్యుమెంట్‌లు అవసరం లేకుండానే పనులు పూర్తి చేసి పంపిస్తారు. కానీ స్వయంగా వెళ్లేవాళ్లకు మాత్రం ఇలాంటి కొర్రీలు తప్పడం లేదు.
అడ్రస్‌లు ఏమారుస్తారు..
కొన్ని కార్యాలయాల్లో దళారులు యథేచ్ఛగా నకిలీ చిరునామాలను సృష్టించి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల బదిలీలు, రిజిస్ట్రేషన్లు వంటి పనులు చేయిస్తున్నారు. తప్పుడు చిరునామాలపై ఏకంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడం, వాహనాల రిజి్రస్టేషన్ చేయడంతో ప్రభుత్వం అందజేసే విలువైన డాక్యుమెంట్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.