వారిని కొందరు ఆడపిల్లలు గుడ్డిగా నమ్ముతూ..: సజ్జనార్‌ | Cybercriminals Blackmail Girls Using Fake Social Media Profiles Sajjanar | Sakshi
Sakshi News home page

వారిని కొందరు ఆడపిల్లలు గుడ్డిగా నమ్ముతూ..: సజ్జనార్‌

Mar 21 2026 4:05 PM | Updated on Mar 21 2026 4:36 PM

Cybercriminals Blackmail Girls Using Fake Social Media Profiles Sajjanar

హైదరాబాద్‌: అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని చెప్పారు.

ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు తన దృష్టికి ఎక్కువగా వస్తున్నాయని, ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోందని సజ్జనార్‌ అన్నారు. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారని చెప్పారు. ఆ మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు వారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను పంచుకుంటున్నారని తెలిపారు.

అలా పంపగానే ఆ అపరిచితులు రాక్షసులుగా మారిపోయి వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని సజ్జనార్‌ వివరించారు. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలని, భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. పరువు పోతుందన్న భయంతో, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక కొందరు అమ్మాయిలు అడిగినంత డబ్బులు ముట్టజెబుతూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. ఈ వేధింపులు తాళలేక కొందరు తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారని చెప్పారు.

‘ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మీకు ఆన్‌లైన్‌లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అస్సలు భయపడకండి. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్‌కు లొంగవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏ మాత్రం సంకోచించకుండా డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు.

తల్లిదండ్రులు సైతం పిల్లలతో కాస్త సమయం గడుపుతూ.. వారు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనేదానిపై ఓ కన్నేసి ఉంచండి. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, వీపీఎన్‌లు వాడితే పోలీసులకు చిక్కబోమని సైబర్ నేరగాళ్లు భ్రమపడొద్దు. మీరు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ, అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నాను’ అని ఎక్స్‌లో సజ్జనార్‌ చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement