ఆడు మగాడ్రా బుజ్జి..! అమ్మాయి కాదు రా!!: సైబరాబాద్‌ పోలీస్‌

Cyberabad Police Used Brahmaji Athadu Meme For FB Fake Profile Frauds - Sakshi

Cyber Crimes Wing Cyberabad: ‘ఏంజెల్‌ ప్రియా’.. ఈ పేరు గురించి తెలుసు కదా!.. ఫేస్‌బుక్‌లో ఫేక్‌ అకౌంట్‌ల పుట్టుకకు ఒకరకంగా ఆజ్యం పోసింది ఈ పేరే.  అయితే సరదాగా మొదలైన ఈ వ్యవహారం ఆ తర్వాతి కాలంలో మోసాలకు తెర లేపింది.  ముఖ్యంగా మగవాళ్లే ఆడవాళ్ల పేర్లతో ఫేస్‌బుక్‌ యూజర్లను ముగ్గులోకి దించడం, కట్టుకథలు చెప్పి అందినంత దోచుకోవడం లాంటి నేరాలు బోలెడు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో కొంతకాలం తగ్గాయనుకున్న ఈ తరహా నేరాలు.. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయట!!. 

సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ పోలీసులు తాజాగా ట్విటర్‌లో ఫన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ పోస్ట్‌ ఒకటి వేశారు. తివిక్రమ్‌-మహేష్‌ బాబు ‘అతడు’లోని ఓ ఫేమస్‌ డైలాగ్‌ మీమ్‌ను వాడేశారు. ‘ఒక అమ్మాయి తనకు ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ పంపి తెగ ఛాటింగ్‌ చేస్తుంద’ని కొడుకు మురిసిపోతుంటే.. ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదు రా’ అంటూ తండ్రి ఆ కొడుక్కి షాక్‌ ఇస్తాడు.

తద్వారా ఫేక్‌ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సందేశం ఇచ్చారు పోలీసులు.  పనిలో పనిగా నటుడు బ్రహ్మాజీని సైతం ట్యాగ్‌ చేసి పడేశారు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ పోలీసులు. సాధారణంగానే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్రహ్మాజీ.. ఆ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు కూడా. 

ఇక సోషల్‌ మీడియా వాడకంలో పోలీసులది డిఫరెంట్‌ పంథా. కరెక్ట్‌ టైమింగ్‌, రైమింగ్‌తో ప్రజల్ని అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడం వాళ్ల విధిగా మారింది. ఈ క్రమంలో నవ్వులు పూయించే మీమ్స్‌ను సైతం వాడేస్తున్నారు. కేరళ, ముంబై పోలీసుల్లాగే..  తెలంగాణ పోలీసుల సోషల్‌ మీడియా వింగ్‌ సైతం హ్యూమర్‌ను పంచుతోంది.

చదవండి: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top