Bala Mithra: గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ గురించి చెబుతారు!

Cyberabad Police to Launch Balamithra in Government Junior Colleges - Sakshi

తొలిసారిగా సైబరాబాద్‌ పరిధిలో.. జూనియర్‌ కళాశాలల్లోనూ బాలమిత్ర

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆచరణ

ఈ ఏడాది పలు ప్రైవేట్‌ స్కూళ్లలోనూ..  

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల కాలంలో మైనర్‌ బాలికలపై అఘాయిత్యాలు, వేధింపులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ షీ టీమ్స్‌ సరికొత్త కార్యాచరణను రూపొందించింది. ఇప్పటివరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే అందుబాటులో ఉన్న బాలమిత్ర కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను బాలమిత్రులుగా ఎంపిక చేసి, కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులకు ఎదురయ్యే సమస్యలను  పరిష్కరించడమే  బాలమిత్రుల విధి అని సైబరాబాద్‌ షీ టీమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీత తెలిపారు. 

► 2019 ఫిబ్రవరి 15న అప్పటి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ బాలమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ క్లాస్‌ల నేపథ్యంలో రెండేళ్ల పాటు బాలమిత్ర కార్యక్రమం తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం భౌతిక పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో తిరిగి బాలమిత్ర ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 1,650 మంది టీచర్లు బాలమిత్రలుగా నమోదయ్యారు. వీరిలో కొంతమంది టీచర్లు బదిలీ కాగా.. మరికొందరు రిటైర్డ్‌ అయ్యారు. దీంతో తాజాగా నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

బాలమిత్రలు ఏం చేస్తారంటే? 
పోక్సో చట్టం గురించి అవగాహన కల్పిస్తారు. చట్టంలోని శిక్షలు, కేసులు నమోదైతే ఉజ్వల భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో వివరిస్తారు. గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ వివరించి, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలో శిక్షణ ఇస్తారు. తల్లిదండ్రులు, టీచర్లతో స్వేచ్ఛగా అన్ని అంశాలు బెరుకు లేకుండా చర్చించే విధంగా సంసిద్ధులను చేస్తారు. ఇంటర్నెట్, స్మార్ట్‌ ఫోన్‌ను ఎంత వరకు వినియోగించాలి? అతి వినియోగంతో కలిగే అనర్థాలను వివరిస్తారు. 

ప్రైవేట్‌ స్కూళ్లలోనూ.. 
పాఠశాల స్థాయిలో బాలమిత్ర కార్యక్రమం 8, 9, 10 తరగతుల కోసం రూపొందించారు. ఈ ఏడాది నుంచి సైబరాబాద్‌ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలతో పాటు ఎంపిక చేసిన పలు ప్రైవేట్‌ స్కూల్స్‌లోనూ బాలమిత్రలను ఏర్పాటు చేస్తారు. (క్లిక్‌: పనులు పూర్తి కాలేదు.. మరింత టైమ్‌ కావాలి!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top