‘విదేశీ’ వైద్య విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ 

CRMI Internship For MBBS Pass Outs Abroad Universities - Sakshi

రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో చాన్స్‌

జాతీయ మెడికల్‌ కమిషన్‌ ఆదేశాలు  

3,833 మంది ఇంటర్న్‌షిప్‌ చేసుకునేలా కాలేజీల కేటాయింపు 

త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం  

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల్లో ఎంబీబీఎస్, తత్సమాన మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్రంలో కంపల్సరీ రొటేటింగ్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌ (సీఆర్‌ఎంఐ) చేసుకునేందుకు జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతిస్తూ  గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల వివరాలను పొందుపరిచింది.

ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ (ఎఫ్‌ఎంజీఈ) పాసైన విద్యార్థులంతా రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఏడాది ఇంటర్న్‌షిప్‌ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వారికి స్టైపెండ్‌ కూడా ఇవ్వాలని ఎన్‌ఎంసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. త్వరలో ఇంటర్న్‌షిప్‌ కోసం ఎఫ్‌ఎంజీఈ పాసైన విదేశీ మెడికల్‌ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కాళోజీ వర్సిటీ తెలి పింది. ఎన్‌ఎంసీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.  

3,833 మందికి ఇంటర్న్‌షిప్‌ అవకాశం.. 
కరోనా కాలంలోనూ, ఆ తర్వాత అనేకమంది విదేశీ ఎంబీబీఎస్‌ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. కొందరు అక్కడకు వెళ్లి చదవగా, చాలామంది ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా మెడికల్‌ కోర్సు పూర్తి చేశారు. అలా విదేశీ వైద్య విద్య పూర్తి చేసినవారు తర్వాత దేశంలో మెడికల్‌ రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్‌ కోసం ఎఫ్‌ఎంజీఈ పరీక్ష రాయాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఎఫ్‌ఎంజీఈ పరీక్ష పాసైన వారు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంది. గతంలో విదేశీ గ్రాడ్యుయేట్ల కోసం కొన్ని కాలేజీల్లోనే ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉండగా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 44 ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం ఆయా కాలేజీల్లో 3,833 మంది ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు. ఇప్పటివరకు ఎంబీబీఎస్‌ బ్యాచ్‌ బయటకు రాని మెడికల్‌ కాలేజీల్లో ఆయా కాలేజీలకు చెందినవారు ఇంటర్న్‌షిప్‌ దశకు చేరుకోనందున, అక్కడ పూర్తిస్థాయిలో విదేశీ గ్రా డ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించారు. సీట్ల సంఖ్యకు మించి కూడా కొన్నిచోట్ల ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top