చచ్చేదాకా బతికేస్తాయి.. వీటి వయసు వందలు, వేల ఏళ్లు!

Creatures That Live For Thousands Of Years - Sakshi

భూమ్మీద ప్రతి జీవికి ఏదో ఒక సమయంలో మరణం తప్పదు. ముసలితనం వచ్చేసి, శరీరం ఉడిగిపోయి చనిపోవడమో... ఏదో ప్రమాదం, రోగం వంటి కారణాలతో అర్ధాంతరంగా ప్రాణాలు పోవడమో జరగొచ్చు. ఇందులో ప్రమాదం, రోగాలు వంటివేవీ లేకుండా.. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక జీవి ఎంతకాలం బతకగలుగుతుందన్న దానిని దాని ఆయుష్షుగా చెప్పుకోవచ్చు.

ఉదాహరణకు మనుషుల ఆయుష్షు గరిష్టంగా 130–150 సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతకుమించి బతికారనిగానీ, బతుకుతారని గానీ చెప్పేందుకు ఆధారాల్లేవు. తాబేళ్లు వంటి జీవులు 250 ఏళ్ల వరకు జీవిస్తాయని గుర్తించారు. కానీ ఎలాంటి ప్రమాదం, రోగాలు వంటివి లేకుంటే.. చావు అనేదే లేకుండా వేలకు వేల ఏళ్లు బతికుండే జీవులు ఉన్నాయి. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

పెద్ద జీవి..  మళ్లీ పిండంగా మారి.. 
ఇది సముద్రంలో జీవించి ‘టుర్రిటోప్సిస్‌ డోహ్రిని’ రకం జెల్లీఫిష్‌. ఉండేది అర సెంటీమీటరే. పారదర్శక శరీరం, సన్నగా వెంట్రుకల్లా ఉండే టెంటకిల్స్‌తో అందంగా కనిపిస్తాయి. అయితే ఈ రకం జెల్లీఫిష్‌లకు వయసు పెరగడం అంటూ ఉండదని, సహజంగా వీటికి చావు లేనట్టేనని అమెరికన్‌ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. సాధారణంగా ఏ ప్రాణి అయినా దశలు దశలుగా ఎదుగుతూ పూర్తిస్థాయి జీవిగా మారుతుంది.

కానీ ఈ జెల్లీఫిష్‌ ఏదైనా గాయం కావడమో, ఇంకేదైనా సమస్య రావడమో జరిగితే.. తిరిగి పూర్వరూపమైన ‘పాలిప్స్‌’గా (ఉదాహరణకు పిండం అనుకోవచ్చు) మారిపోతుంది. తర్వాత మళ్లీ జెల్లీఫిష్‌గా ఉత్పత్తి అయి ఎదుగుతుంది. ఎప్పటికీ ఇలా జరుగుతూనే ఉంటుందని, సాంకేతికంగా దానికి సహజ మరణం లేనట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చేపలో, ఇతర సముద్ర జీవులో వీటిని గుటుక్కుమని మింగేస్తాయి. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ జెల్లీఫిష్‌లకు మెదడు, గుండె ఉండవట. 

ప్రతి కణం.. ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌
ఈ ఫొటోలో కనిపిస్తున్న మరో సముద్ర జీవి పేరు హైడ్రా. ఒక సెంటీమీటర్‌ వరకు పెరుగుతుంది. చూడటానికి జెల్లీఫిష్‌లా కనిపించే ఈ జీవి కూడా దాదాపు చావులేనిదే. దీని శరీరం చాలా వరకు మూలకణాలు (స్టెమ్‌సెల్స్‌)తో నిర్మితమై ఉంటుందట. మూలకణాలకు శరీరంలో ఏ అవయవంగా, ఏ కణాజాలంగా అయినా మారే సామర్థ్యం ఉంటుంది.

దనివల్ల హైడ్రాకు గాయాలైనా, ఏ భాగం దెబ్బతిన్నా తిరిగి పునరుత్పత్తి అవుతాయి. అందువల్ల ఈ జీవులకు వృద్ధాప్య ఛాయలే కనబడవు. కానీ చేపలు, ఇతర సముద్ర జీవుల తినేయడం, రోగాలు వంటివాటితో హైడ్రాల పని ముగిసిపోతుంది. 

మానవ పిండం కూడా తొలిదశలో మూలకణాల సమాహారమే. ఆ కణాలే విభజన చెందుతూ.. వివిధ అవయవాలు, ఎముకలు, కండరాలుగా మారుతాయి. పూర్తిస్థాయి మనుషుల్లో ఎముక మజ్జలో మాత్రమే మూలకణాలు ఉంటాయి. వాటిని వివిధ అవయవాలుగా అభివృద్ధి చేసే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు. 

వీటి వయసు వందలు, వేల ఏళ్లు.. 
ఇవి అంటార్కిటికా మహాసముద్రం అడుగున జీవించే ‘గ్లాస్‌ స్పాంజ్‌’లు. అత్యంత శీతల పరిస్థితుల్లో, అత్యంత మెల్లగా పెరిగే ఈ జీవులు 10–15 వేల ఏళ్లపాటు జీవిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

ఇవి నార్త్‌ అట్లాంటిక్‌ సముద్రంలో ఉండే ‘ఓసియన్‌ క్వాహోగ్‌’ రకం ఆల్చిప్పలు. అమెరికా నేషనల్‌ మ్యూజియం శాస్త్రవేత్తలు 2006లో ఈ రకం ఆల్చిప్పపై  పరిశోధన చేసి.. దాని వయసు 507 ఏళ్లు అని గుర్తించారు. 1499వ సంవత్సరంలో అది పుట్టి ఉంటుందని అంచనా వేశారు. 

ఇది గ్రీన్‌ల్యాండ్‌ షార్క్‌. ఆర్కిటిక్, అట్లాంటిక్‌ మహాసముద్రాల్లోని లోతైన ప్రాంతాల్లో జీవిస్తుంది. ఎనిమిది మీటర్ల పొడవు పెరిగే ఈ షార్క్‌లు 250 ఏళ్లకుపైనే జీవిస్తాయని తొలుత భావించేవారు. అయితే 2016లో వలకు చిక్కిన ఓ గ్రీన్‌ల్యాండ్‌ షార్క్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. దాని వయసు 392 ఏళ్లు అని తేల్చారు. 

తాబేళ్లు.. లెక్క తక్కువే.. 
మనకు స్కూళ్లు, కాలేజీల్లో పాఠాల్లో, ఇతర పుస్తకాల్లో.. భూమ్మీద ఎక్కువకాలం బతికే జంతువు తాబేలు అని చెప్తుంటారు. రెండు వందల ఏళ్లకుపైగా జీవిస్తాయని అంటుంటారు. కానీ వాస్తవంగా.. ఎక్కువకాలం బతికే జీవుల్లో తాబేలు ఓ లెక్కలోకే రాదని శాస్త్రవేత్తలు తేల్చారు.

తాబేళ్లలో అన్నింటికన్నా జియాంట్‌ గలపాగోస్‌ రకం తాబేళ్లు ఎక్కువ కాలం బతుకుతాయి. వీటిలో ఇప్పటివరకు అధికారికంగా గుర్తించిన అత్యధిక వయసు 192 ఏళ్లు మాత్రమే. అయితే ఈ తాబేళ్లు ఎలాంటి ఆహారం, నీళ్లు లేకున్నా ఏడాదిపాటు బతకగలవని.. వాటి శరీరంలో ఈ మేరకు నిల్వ ఏర్పాట్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  

ఎరుపు, తెలుపు రంగులతో పెయింట్‌ వేసినట్టు అందంగా ఉండే చేపలు కొయి కార్ప్స్‌. అక్వేరియంలలో పెంచుకునే ఈ చేపలు సాధారణంగా 40 ఏళ్లు జీవిస్తాయని చెప్తారు. కానీ 1977లో జపాన్‌ తీరంలో పట్టుకున్న ఒక కొయికార్ప్స్‌పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు దాని వయసు 226 ఏళ్లు అని గుర్తించారు. 

గుండ్రంగా ఉండి, శరీరం చుట్టూ ముళ్లలాంటి నిర్మాణాలు ఉండే సముద్ర జీవి ‘రెడ్‌సీ ఉర్చిన్‌’. పసిఫిక్‌ మహాసముద్రంలో బతికే ఇవి కనీసం 200 ఏళ్లపాటు బతుకుతాయట.  

తొండలా ఉండే ఈ జీవి పేరు ‘ట్వటరా’. న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే ఇవి. వందేళ్ల వరకు బతుకుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీటికి తలపై మధ్యభాగంలో మూడో కన్ను ఉంటుంది. 

వృద్ధాప్యం  ఎందుకొస్తుంది? 
జీవుల కణాల్లోని క్రోమోజోమ్‌లపై జన్యువులు, క్రోమోజోమ్‌ల అంచుల్లో సన్నని పోగుల్లాంటి టెలోమెర్లు ఉంటాయి. మన వయసు పెరిగిన కొద్దీ, శరీర కణాలు విభజన చెందినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతినడం, టెలోమెర్ల పరిమాణం తగ్గిపోవడం జరుగుతూ ఉంటాయి. ఒకస్థాయి దాటిన తర్వాత కణాలకు పునరుత్పత్తి చెందే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనితో శరీరం, అవయవాలు బలహీనమై వృద్ధాప్యం వస్తుంది. ఇది సహజ మరణానికి దారితీస్తుంది. ఆయా జీవుల్లో జన్యువుల సామర్థ్యం, ఇతర అంశాల ఆధారంగా వాటి ఆయుష్షు ఆధారపడి ఉంటుంది. 

ఎక్కువ కాలం బతకడానికి కారణాలేమిటి? 
వయసు పెరిగినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతింటున్నా.. దానిని తిరిగి మరమ్మతు చేసుకునే సామర్థ్యం కొన్నిరకాల జీవుల్లో ఉంటుంది. వాటిలోని కొన్ని ప్రత్యేకమైన జన్యువులే దీనికి తోడ్పడుతుంటాయి. 

కొన్ని ప్రాణులు అవి జీవించే వాతావరణానికి తగినట్టుగా శరీరంలో మార్పులు చేసుకుంటాయి. కణాజాలాలను పునరుత్పత్తి చేసుకుంటాయి. ఈ క్రమంలో వాటి జీవితకాలం పెరుగుతుంటుంది. 

కొన్నిరకాల షార్కులు, ఎండ్రకాయలు, ఇతర జంతువుల్లో ‘టెలోమెరేస్‌’ అనే ప్రత్యేకమై ప్రొటీన్‌ విడుదలవుతుంది. అది కణాల్లో టెలోమెర్‌లు పొడవు పెరగడానికి తోడ్పడి.. వాటి జీవితకాలం పెరుగుతుంది. 

అత్యంత మెల్లగా ఎదిగే జీవుల్లో చాలా వరకు ఎక్కువకాలం బతుకుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిల్లో తరచూ కణాల విభజన జరగాల్సిన అవసరం లేకపోవడమే దానికి కారణమని చెప్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top