‘కనెక్షన్‌’లో కలెక్షన్‌! | Corruption in Electricity Department: Telangana | Sakshi
Sakshi News home page

‘కనెక్షన్‌’లో కలెక్షన్‌!

Jun 20 2026 2:12 AM | Updated on Jun 20 2026 2:12 AM

Corruption in Electricity Department: Telangana

కొత్త కనెక్షన్ల మంజూరులో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది చేతివాటం 

విద్యుత్‌ శాఖ అంతర్గత అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో నెలకు వందకుపైగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఏటా 3 వేల వరకూ దెబ్బతింటున్నాయి. ప్రతిరోజూ కనీసం 60 ప్రాంతాల్లో విద్యుత్‌ లోఓల్టేజీ లేదా విద్యుత్‌ అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని విద్యుత్‌ అధికారులు ప్రకృతి వైపరీత్యాలపై నెట్టేస్తున్నారు. సాంకేతిక లోపాలంటూ తప్పించుకుంటున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

ట్రాన్స్‌ఫార్మర్‌ స్థాయికి మించి విద్యుత్‌ లోడ్‌ ఇవ్వడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు జరిపిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. ఈ వ్యవహారం వెనుక విద్యుత్‌ సిబ్బంది ముడుపుల వ్యవహారం ఉంటోంది. ఈ అవినీతిలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఉన్నతాధికారుల వరకూ భాగం ఉంటోంది. 

లోడ్‌ ఉన్నా కనెక్షన్‌ 
వినియోగదారులు కొత్త కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసేప్పుడు విద్యుత్‌ అధికారులు హైడ్రామా ఆడుతున్నారు. వాస్తవానికి లోడ్‌ ఎంత ఉందో ముందే లెక్కగట్టాలి. ట్రాన్స్‌ఫార్మర్‌ స్థాయి కన్నా ఎక్కువ లోడ్‌ ఉంటే కొత్తదాన్ని బిగించాలి. దీనికి వినియోగదారుల నుంచి అధికారికంగా ఫీజు వసూలు చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్‌ ఖర్చు, బిగింపు, రవాణా ఇతరత్రా లెక్కలు వేసి, వినియోగదారులను ముందుగా విద్యుత్‌ సిబ్బంది భయపెడుతున్నారు.

దీంతో వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తోంది. లోడ్‌ తక్కువున్న...దూరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్‌ ఇస్తామని, రికార్డుల్లో చూపిస్తారు. కానీ లోడ్‌ ఎక్కువగా ఉన్న దగ్గర్లోని ట్రాన్స్‌ఫార్మర్‌కే కనెక్షన్‌ ఇస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల కనెక్షన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. దీనికి ఒక్కో వినియోగదారుడి నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు.

కార్పొరేట్‌ ఆఫీసుల విషయంలో విద్యుత్‌ అధికారుల పంట పండినట్టే. మల్టీ నేషన్‌ కంపెనీలు ఖర్చులను పెద్దగా పట్టించుకోవు. కాబట్టి రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. దీంతో లోడ్‌ ఎక్కువగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కే కనెక్షన్లు ఎక్కువవుతున్నాయి. ఫలితంగా తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, పేలిపోవడం లేదా చెడిపోవడం జరుగుతోందని డిస్కమ్‌ల అంతర్గత అధ్యయనంలో వెల్లడైంది. 

చేతులెత్తేస్తున్న ఉన్నతాధికారులు 
హైదరాబాద్‌ నగరంలో ఓ ఏఈ తన పరిధిలో పది చోట్ల లోడ్‌ ఎక్కువగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కే నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్లు ఇచ్చాడు. ఈ విషయమై అధికారులు నిలదీస్తే, మర్నాడే ఓ రాజకీయ నేత నుంచి ఫోన్‌ వచి్చంది. ఖమ్మంలో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. లోడ్‌ ఎక్కువై 12 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. దీనికి ఏఈని సస్పెండ్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ జిల్లా అధికారులకు రాజకీయ నేతల నుంచి ఫోన్‌ వస్తే ఆగిపోయారు.

ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. సిబ్బంది కూడా విచిత్రమైన సమాధానం చెబుతున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించే వరకూ వినియోగదారులు ఓపిక పట్టడం లేదని చెబుతున్నారు. ఎవరో ఒక నాయకుడితో ఫోన్లు చేయిస్తున్నారని, అందుకే ఉన్నచోట కనెక్షన్లు ఇస్తున్నామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము మాత్రం ఏం చేయగలమని ఉన్నతాధికారులు చేతులు ఎత్తేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement