నెలన్నర కీలకం.. అప్పటివరకు కరోనా కేసుల్లో పెరుగుదల

Coronavirus: Telangana Health Director Srinivasa Rao On Cases Raise - Sakshi

అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

మాస్కు ధరించాలి, వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాల్లేవు

విద్యా సంస్థల్లో టీకా శిబిరాలు ఏర్పాటు చేస్తాం

జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీగా డెంగీ కేసులు

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా గత రెండు వారాలుగా కరోనా కేసుల్లో పెరుగుదల ఉందని, ఈ సమయంలోనే 66 శాతం కేసులు పెరిగాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. నెల నుంచి నెలన్నరపాటు కరోనా కేసుల్లో పెరుగుదల ఉంటుందని హెచ్చరించారు. అప్పటివరకు ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేసుల్లో పెరుగుదల మహారాష్ట్రలో 145 శాతం, ఏపీలో 111 శాతం, కేరళలో 77 శాతం ఉందన్నారు.

తెలంగాణలో గత వారంలో 355 కేసులు నమోదైతే, ఈ వారంలో 555 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 55 శాతం పెరుగుదల ఉందన్నారు. శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘దేశంలో పాజిటివిటీ రేటు 1.4 శాతం ఉండగా, తెలంగాణలో దాదాపు ఒక శాతానికి చేరుకుంది. క్రియాశీలక కేసులు పెరిగాయి. కరోనా కేసులు పెరుగు తున్నా ఆసుపత్రుల్లో రెండు మూడు కేసులు మాత్రమే ఉన్నాయి.

రెండు నెలలుగా కరోనా మరణాలు సంభవించలేదు. కరోనా నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలు లేవు. కరోనా వ్యాక్సినేషన్‌ నూటికి నూరు శాతం జరగడం వల్ల ప్రజల్లో యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయి. మే నెల నుంచి ఇప్పటివరకు ఒమిక్రాన్‌లోని సబ్‌ వేరియంట్‌ అయిన బీఏ.2 కేసులు 66 శాతం నమోదయ్యాయి. కొత్త వేరియంట్లు పుట్టలేదు కాబట్టి నాలుగో వేవ్‌ రాదని చెబుతున్నాం’ అని చెప్పారు. కరోనా ఇంకా అంతం కాలేదని, ఆరు నెలల నుంచి ఏడాది వరకు అప్పుడప్పుడు కేసుల్లో పెరుగుదల కనిపిస్తుందన్నారు. తర్వాత అది ఎండెమిక్‌ (వైరస్‌ వ్యాప్తి తగ్గే) దశకు చేరుకుంటుందని పేర్కొన్నారు. 

జాగ్రత్తలే శ్రీరామరక్ష
ప్రస్తుతం వర్షాకాల సీజన్‌ ప్రారంభం అవుతోం దని, సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయని శ్రీనివా సరావు చెప్పారు. దాంతోపాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణ ఫ్లూలో గొంతులో గరగర, ముక్కుకారటం వంటివి ఉంటాయని, కోవిడ్‌లో అవే లక్షణాలతో జ్వరం, పొడిదగ్గు ఉంటా యన్నారు.

కరోనాలో ఈ లక్షణా లు ఐదు రోజుల వరకు ఉంటాయని, అను మానముంటే ప్రజలు తక్షణమే పరీక్షలు చేయించు కోవాలని కోరారు. కరోనా నుంచి బయటపడా లంటే మాస్క్‌ తప్పనిసరని, అలాగే వ్యాక్సిన్‌ కూడా తీసుకోవాలన్నారు. ఈ నెల 3 నుంచి ఇంటింటికీ కరోనా టీకా వేస్తున్నామన్నారు. త్వరలో పాఠశాలలు, విద్యాసంస్థలు ప్రారంభమవుతాయని, 12–18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు వేయించాలని తల్లిదండ్రులను కోరారు.

అందుకోసం విద్యా సంస్థల్లో టీకా శిబిరాలు ఏర్పాటు చేస్తామ న్నారు. ఆన్‌లైన్‌ తరగతులు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు బూస్టర్‌ డోస్‌ వేస్తామన్నారు. ‘పిల్లల వ్యాక్సిన్లలో లక్షల్లో ఎక్కడో ఒక రియాక్షన్‌ వచ్చిందన్న అపోహలు ప్రజల్లో ఉన్నాయి. కానీ ఎలాంటి భయాందోళనలు అవసరం లేకుండా టీకా వేయించాలి. 12 ఏళ్లలోపు వారికి కరోనా వచ్చే అవకాశాలు తక్కువ.

వారికి వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. రాబోయే రోజుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతాం. నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తాం. జీహెచ్‌ఎంసీలో జనసాంద్రత ఎక్కువ కాబట్టి ఇక్కడ క్రియాశీలక కేసులు ఎక్కువగా ఉన్నాయి. కేసులు ఎక్కువైతే మాస్క్‌లు పెట్టుకోనివారికి జరిమానాలు విధిస్తారు’ అని చెప్పారు. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల నుంచి రెండు శాతం శాంపిళ్లు తీసుకొని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయిస్తున్నామన్నారు. ఇటీవల 527 శాంపిళ్లకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయగా, అందులో 65 శాతం బీఏ.2 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ నమోదైందన్నారు.

ఈసారి డెంగీ దడ
2019లో రాష్ట్రంలో డెంగీ కేసులు అధికమొత్తంలో నమోదు అయ్యాయని, అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తోందని శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు అధికంగా నమోదవుతున్నా యన్నారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 158 డెంగీ కేసులు నమోదయ్యాయని, అందులో ఏప్రిల్, మే నెలల్లోనే వంద కేసులు రికార్డు అయ్యాయన్నారు.

మురికి వాడల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, అక్కడ 150 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 10 వేల మంది శాంపిళ్లకు డెంగీ పరీక్షలు చేసినట్లు తెలిపారు. జిల్లాల్లో పెద్దగా డెంగీ ప్రభావం లేదన్నారు. పగటి దోమ వల్ల డెంగీ కేసులు పెరుగుతాయని, కాబట్టి నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. తమ అంచనా ప్రకారం ఈసారి డెంగీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో చెరువులు, నీటి కుంటలు ఎక్కువగా ఉన్నందున దోమలు వృద్ధి చెందాయని, అందుకే సీజన్‌ ప్రారంభానికి ముందే డెంగీ కేసులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, వాటిల్లో 15 భవనాలను కొత్తగా నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు.  

చదవండి: ముంచుకొస్తున్న మహమ్మారి.. పెరుగుతున్న కేసులు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top