హైదరాబాద్‌లో నిలకడగా.. జిల్లాల్లో దూకుడుగా..

Coronavirus Positive Cases Increasing In Telangana Districts - Sakshi

పట్టణాలు, పల్లెల్లో పంజా విసురుతున్న కరోనా

పలు జిల్లాల్లో వారం రోజుల్లోనే రెట్టింపు కేసులు

ఒకట్రెండు జిల్లాల్లో వారంలోనే మూడింతలు

భాగ్యనగరంలో మాత్రం నిలకడగా నమోదు

తాజాగా 60,386 పరీక్షలు.. 2,795 కోవిడ్‌ కేసుల నమోదు

సాక్షి, హైదరాబాద్‌: మొన్నటివరకు హైదరాబాద్‌లో ప్రతాపం చూపించిన వైరస్‌.. ఇప్పుడు జిల్లాల్లో విజృంభిస్తోంది. పట్టణాలు, పల్లెల్లో పంజా విసురుతోంది. వారం రోజుల్లోనే చాలా జిల్లాల్లో రెట్టింపు కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. కొన్ని జిల్లాల్లో మూడు, నాలుగింతలు కూడా రికార్డయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్‌ మేరకు.. ఈ నెల 20న జీహెచ్‌ఎంసీ పరిధిలో 473 కేసులుండగా, 26న 449 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గత వారం రోజులుగా కేసుల సంఖ్య దాదాపు నిలకడగానే కొనసాగుతోంది. కానీ జిల్లాల్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 20న 21 కేసులు నమోదు కాగా, 26న ఏకంగా 72 కేసులు రికార్డయ్యాయి. అంటే మూడింతలకు మించిన కేసులన్న మాట. భూపాలపల్లి జిల్లాలో 20న 12 కేసులు నమోదు కాగా, 26న 26 కేసులు.. అంటే రెట్టింపునకు మించి నమోదయ్యాయి.

ఖమ్మం జిల్లాలో వారం క్రితం 79 కేసులు నమోదైతే, ఇప్పుడు 152 కేసులు నమోదయ్యాయి. ఇక మహబూబాబాద్‌ జిల్లాలోనైతే వారం క్రితం 26 కేసులు నమోదైతే, ఇప్పుడు ఏకంగా 102 కేసులు రికార్డయ్యాయి. మంచిర్యాల జిల్లాలో వారం క్రితం 40 కేసులుంటే, ఇప్పుడు 106 కేసులు రికార్డయ్యాయి. నల్లగొండ జిల్లాలో వారం క్రితం 60 కేసులుంటే, ఇప్పుడు 164 నమోదయ్యాయి. నిజామాబాద్‌లో ముందు 69 కేసులుంటే, ఇప్పుడు 112 నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో వారం క్రితం 35 కేసులుంటే, ఇప్పుడు 77 నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో వారం క్రితం 49 కేసులుంటే, ఇప్పుడు 113 కేసులు వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 20న 18 కేసులుంటే, 26న 39 కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల వరకు కంటైన్మెంట్‌ జోన్లున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. పల్లెల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందడంతో గ్రామాల్లో అలజడి నెలకొంది. వచ్చే నెలాఖరుకు దాదాపు 3 వేల గ్రామాల్లోకి వైరస్‌ ప్రవేశించే అవకాశముందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

మరో 2,795 కేసులు..
రాష్ట్రంలో బుధవారం (26వ తేదీన) 60,386 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,795 పాజిటివ్‌ కేసులు వచ్చాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులిటెన్‌లో వెల్లడించారు. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. తాజాగా కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 788కి చేరింది. కరోనా బారి నుంచి తాజాగా 872 మంది కోలుకోగా, ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 86,095కి చేరిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,600 యాక్టివ్‌ కేసులున్నాయి. అందులో ఇళ్లు, ఇతరత్రా ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతున్నవారు 20,866 మంది ఉన్నారు. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 11,42,480 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top