పోలీసు శాఖపై కరోనా పంజా

Coronavirus Cases Increases In Police Department In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన పోలీస్‌లపై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. మహమ్మారి విజృంభిస్తుండడంతో రోజురోజుకు కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ఆది నుంచి నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసులకే మహమ్మారి సోకడంతో వారిలో ఆందోళన మొదలైంది. కమిషనరేట్‌ వ్యాప్తంగా ఆదివారం వరకు 118 మంది పోలీసులు కరోనాబారిన పడ్డారు. వారితో కలిసి విధులు నిర్వహించిన వారు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో శనివారం నుంచి గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయాలు, ప్రముఖ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల నియంత్రణ, వైరస్‌ వ్యాప్తిని అరికట్టే విధులనూ పోలీసులే నిర్వహించాల్సి ఉంది. 

పెరుగుతున్న కేసులు
పోలీస్‌శాఖలో కరోనా సోకుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కమిషనరేట్‌ వ్యాప్తంగా మొదట్లో కేవలం శిక్షణ కానిస్టేబుళ్లు 39 మందికి వైరస్‌ సోకగా, ఆదివారం వరకు కమిషనరేట్‌ పరిధిలో 118 మంది పోలీసులకు వైరస్‌ సోకింది. ఇందులో నగరానికి చెందిన ఒక సీఐ, ఎస్సై, కార్పొరేషన్‌ పరిధిలోని ఒక సీఐతో పాటు స్పెషల్‌ బ్రాంచిలో ఐదుగురు, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది 30, హోంగార్డులు 25 మంది, డ్రైవర్లు 15 మందితోపాటు శిక్షణ కానిస్టేబుళ్లు, వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అ«ధికారులు, సిబ్బంది వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఆసుపత్రిలో, ఇళ్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేకంగా ఒక ఏసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు వైరస్‌ సోకిన పోలీసుల ఆరోగ్య పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. 

ఉత్సవాల్లో జాగ్రత్త ..
కరోనా కమ్యూనిటీ వ్యాప్తి నేపథ్యంలో పండుగలు, ఉత్సవాలు, పూజలు, ప్రార్థన వేళల్లో భౌతికదూరం పాటిస్తే అందరికీ క్షేమమని సీపీ కమలాసన్‌రెడ్డి సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 641 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపా రు. ఆలయాలు, వివిధ ప్రార్థన మందిరాల్లో 561 విగ్రహాలు, మిగతావి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అందరూ నిబంధనల ప్రకారం మూడు నుంచి ఐదు రోజుల్లోనే నిమజ్జనం చేయడానికి సన్నాహా లు చేస్తున్నారని, వేడుకలు నిర్వహించే రోజుల్లో భక్తులు కూడా సామూహిక పూజలకు దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ, మున్సిపాలిటీ ఉద్యోగులు, అధికారులు విధుల్లో బిజీగా ఉంటున్నారని, పోలీసులు కూడా మహమ్మారి బారిన పడి ఐసోలేషన్, క్వారంటైన్‌లో ఉన్నారని వివరించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top