తొమ్మిదేళ్లుగా ‘పెండింగే’ | Construction of permanent buildings for excise stations pending: Telangana | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్లుగా ‘పెండింగే’

Jun 16 2025 5:54 AM | Updated on Jun 16 2025 5:54 AM

Construction of permanent buildings for excise stations pending: Telangana

2015–16లోనే 56 కొత్త ఎక్సైజ్‌ భవనాల నిర్మాణానికి అనుమతులు 

ఇప్పటివరకు పూర్తయినవి 18 మాత్రమే.. అందులోనూ 10 స్టేషన్లే వినియోగంలోకి 

ఇంకా రూ.3 కోట్ల పెండింగ్‌ బిల్లులు... ఆ నిధులివ్వాలని ప్రభుత్వానికి ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదన 

14 కొత్త ఎక్సైజ్‌ స్టేషన్ల ప్రారంభం ప్రతిసారీ వాయిదానే

సాక్షి, హైదరాబాద్‌: ఎక్సైజ్‌ స్టేషన్లకు శాశ్వత భవనాల నిర్మాణం ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. 2015–16లో రాష్ట్ర వ్యాప్తంగా 56 కొత్త ఎక్సైజ్‌ స్టేషన్‌ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో కేవలం 18 మాత్రమే పూర్తి కాగా, అందులోనూ 10 మాత్రమే వినియోగంలోనికి వచ్చాయి. ప్రతి ఎక్సైజ్‌ స్టేషన్‌ భవన నిర్మాణానికి అప్పట్లోనే రూ.40 లక్షల చొప్పున మంజూరు చేసింది.

ఇందుకుగాను రూ.20 కోట్లకు పైగా నిధులు అవసరం కాగా, అందులో కేవలం రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఈ నిధులతో 18 భవనాల నిర్మాణాలు ప్రారంభం కాగా, మిగిలిన చోట్ల స్థలాల సమస్య, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం లాంటి కారణాలు అడ్డంకిగా మారాయి. అప్పట్లో నిర్మించిన భవనాలకు సంబంధించిన రూ.3 కోట్ల పెండింగ్‌ బిల్లులున్నాయని, వాటిని మంజూరు చేయాలని ఎక్సైజ్‌ శాఖ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది.  

స్టేషన్లు ప్రారంభించేదెప్పుడు? 
ఎక్సైజ్‌ స్టేషన్లకు భవనాల నిర్మాణం మాట అటుంచితే కొత్త ఎక్సైజ్‌ స్టేషన్ల ప్రారంభం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. కొన్ని ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధి చాలా ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో కొత్త ఎక్సైజ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా, వాటి పరిధిని తగ్గించాలనే ప్రతిపాదనలు కూడా 2016లోనే వచ్చాయి. ఇందుకు సంబంధించిన జీవో కూడా అప్పుడే వెలువడింది. అప్పటి నుంచి ఎక్సైజ్‌ అధికారుల అలసత్వం, ప్రభుత్వ ఉదాసీనత కారణంగా ఈ స్టేషన్ల ఏర్పాటు ఆగిపోయింది. అయితే, ఇటీవల ఎక్సైజ్‌ అధికారులు కొంత చొరవ తీసుకొని వీటి పరిధిని నిర్ణయించడం, ఆయా స్టేషన్లకు హౌస్‌ ఆఫీసర్లను, సిబ్బందిని నియమించడం లాంటివి జరిగాయి.

అద్దె భవనాలు అందుబాటులో ఉంటే కొత్త స్టేషన్లను కొత్త భవనాల్లో ఏర్పాటు చేయాలని, లేదంటే పాత స్టేషన్‌లోనే కొత్త స్టేషన్‌ను కూడా నడిపించాలని ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో అధికారికంగానే బంజారాహిల్స్, మారేడుపల్లి, చిక్కడపల్లి, గండిపేట, కొండాపూర్, మీర్‌పేట, పెద్ద అంబర్‌పేట, కొంపల్లి, కూకట్‌పల్లి, కాప్రా, నాగారం, అల్వాల్, అమీన్‌పూర్, హసన్‌పర్తిలలో కొత్త ఎక్సైజ్‌ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. కానీ వాటిని ప్రభుత్వం ప్రారంభించడం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. హైదరాబాద్‌ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక కారణంతో ఒకసారి, మే, జూన్‌ నెలల్లో రెండుసార్లు వాయిదా పడ్డాయి. అయితే, ఇటీవల ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ నెలలోనే వాటిని ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడైనా అవి అధికారికంగా ప్రారంభమవుతాయని ఎక్సైజ్‌ వర్గాలు ఆశిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement