ఎటూ తేల్చని కాంగ్రెస్‌ | Congress Yet To Decide On Telangana MLC Elections | Sakshi
Sakshi News home page

ఎటూ తేల్చని కాంగ్రెస్‌

Nov 21 2021 4:35 AM | Updated on Nov 21 2021 4:35 AM

Congress Yet To Decide On Telangana MLC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు పడుతోంది. నామినేషన్ల దాఖలుకు మరో మూడురోజులే గడువు మిగిలి ఉన్నా ఈ ఎన్నికల్లో పోటీపై ఎటూ తేల్చులేకపోతోంది. వాస్తవానికి త్వరలో ఎన్నికలు జరగనున్న 12 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఎక్కడా గెలిచే బలం లేదు. ఈ నేపథ్యంలో పోటీ చేసి పరాభవం పొందడం పార్టీకి నష్టం కలిగిస్తుందనే భావనలో టీపీసీసీ ముఖ్యులున్నట్లు తెలుస్తోంది. అయితే నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ స్థానాల్లో పోటీకి కొందరు పార్టీ నేతలు సిద్ధపడుతుండడంతో అక్కడ పోటీ చేద్దామా అనే ఆలోచనలో ఉంది. దీనిపై చర్చించేందుకు టీపీసీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ శనివారం గాం«ధీభవన్‌లో సమావేశమైంది.

టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి చిన్నారెడ్డి పాల్గొని చర్చించారు. కానీ పోటీ చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే పరాజయాలు ఎదురవుతుండడం, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం రుచి చూడడంతో మళ్లీ ఇప్పుడు అనవసరంగా చేతులు కాల్చుకోవడం ఎందుకనే భావనలో కాం గ్రెస్‌ ముఖ్య నేతలున్నారు. గెలిచే అవకాశం లేనప్పు డు పోటీకి దిగడం ద్వారా కొత్త తలనొప్పులు వస్తాయని, క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు మళ్లీ వలస బాట పడితే అసలుకే ఎసరు వస్తుందనే యోచనలో వారున్నారు.  

ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తాం: దామోదర 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై పార్టీ నేతలతో చర్చించామని, మరికొందరు నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక ట్రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని దామోదర రాజనర్సింహ శనివారం గాంధీభవన్‌లో మీడియాతో చెప్పారు. తమ భేటీలో అధికార పార్టీ ఖర్చు పెట్టబోయే డబ్బు ప్రభావంపై కూడా చర్చించామని అన్నారు. ఎన్నికలొస్తే అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభపెడుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ నుంచి గెలిచిన స్థానిక ప్రతినిధుల్లో సగం మందిని ఇప్పటికే టీఆర్‌ ఎస్‌ లాగేసుకుందని విమర్శించారు. టీపీసీసీ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదించి అధిష్టానం అనుమతి తర్వాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అయితే పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించినా, అధిష్టానం అనుమతి తీసుకున్న తర్వాత ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement