ఉగాదికి అటు ఇటుగా! | Congress high command decides to expand telangana state cabinet | Sakshi
Sakshi News home page

ఉగాదికి అటు ఇటుగా!

Mar 25 2025 4:12 AM | Updated on Mar 25 2025 4:12 AM

Congress high command decides to expand telangana state cabinet

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం 

నలుగురా లేక ఐదుగురా అన్న దానిపై కొరవడిన స్పష్టత 

రాజగోపాల్‌రెడ్డి, వివేక్, శ్రీహరి పేర్లు దాదాపు ఖరారు 

పోటీలో సుదర్శన్‌రెడ్డి, విజయశాంతి,ప్రేమ్‌సాగర్‌రావు, ఆది శ్రీనివాస్‌   

బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చినవారికి అవకాశం లేనట్టే..! 

ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్‌ తదితరులతో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో నెలలుగా ఊరిస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం సమీపించింది. ఉగాదికి కొంచెం అటు ఇటుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్‌ అధిష్టానం, రాష్ట్ర పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. నలుగురా? లేక ఐదుగురా? అన్నది తేలాల్సి ఉంది. ఏఐసీసీ వర్గాలు, రాష్ట్ర నేతలు అందిస్తున్న సమాచారం మేరకు.. సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారైనట్లు తెలుస్తుండగా, మిగతా పేర్లపై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

విస్తృత చర్చలు..అనేక కోణాల్లో పరిశీలన 
ప్రస్తుతం ఆరు కేబినెట్‌ స్థానాలు ఖాళీ ఉండగా, వీటి భర్తీపై గత కొన్ని నెలలుగా విస్తృత కసరత్తు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు పలుమార్లు హైకమాండ్‌తో చర్చలు జరిపినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 

అయితే ప్రస్తుతం కీలకమైన కులగణన పూర్తికావడం, దానికి చట్టబద్ధత కల్పించే బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం, మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్, భట్టి, ఉత్తమ్, మహేశ్‌గౌడ్‌లు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లతో ఇందిరా భవన్‌లో భేటీ అయ్యారు. 

సుమారు గంటన్నర పాటు జరిగిన చర్చల్లో జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పారీ్టలో పనిచేసిన అనుభవం, సీనియార్టీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపికపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ బీ–ఫామ్‌ల మీద గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రివర్గంలో చోటు కల్పించాలని, కాంగ్రెస్‌లో చేరిన ఇతర పారీ్టల ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరాదని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన నేతలెవరికీ పదవులు దక్కే అవకాశం లేదని పారీ్టవర్గాలు చెబుతున్నాయి. 

గుర్తించిన నేతలపై విస్తృత చర్చ 
సోమవారం నాటి భేటీలో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఇదివరకే గుర్తించిన పేర్లపై మరోమారు చర్చించారు. ఇందులో మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్‌ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్, కరీంనగర్‌ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, మైనార్టీ కోటాలో షబ్బీర్‌ అలీ, ఆమేర్‌ అలీఖాన్‌ల పేర్లు ఉన్నాయి. 

అలాగే మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును కూడా పరిశీలించినట్టు సమాచారం. ఆమెను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పుడే కేబినెట్‌లోకి కూడా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. నిజామాబాద్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్‌రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.  

ప్రేమ్‌సాగర్‌ వైపు భట్టి మొగ్గు 
వెలమ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవికి పోటీ ఎక్కువగా ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌ రావు, మదన్‌మోహన్, మైనంపల్లి రోహిత్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ల మధ్య పోటీ నెలకొంది. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇవ్వాలా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్టు తెలిసింది.  

మదన్‌మోహన్‌కు పార్టీ పెద్దలు, రోహిత్‌కు సీఎం ఆశీస్సులు! 
మదన్‌మోహన్‌ పార్టీ పెద్దల నుంచి ఒత్తిళ్లు తెస్తుండగా, రోహిత్‌కు ముఖ్యమంత్రి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్‌లలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌ ఉన్నా, తాజా నిర్ణయం నేపథ్యంలో వారికి అవకాశం లేదని తెలిసింది. నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఎస్టీ (లంబాడా) కోటాలో శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్సీగా చేసినందున, బాలూనాయక్‌ను కేబినెట్‌లోకి తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్‌గా చేయాలన్న ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి. 

త్వరలో కార్యవర్గం! 
పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఏఐసీసీ పెద్దలతో భేటీలో ఈ అంశం కూడా చర్చకు రాగా ముందుగా నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు, 20 మందికి పైగా వైస్‌ ప్రెసిడెంట్‌లను ప్రకటించేందుకు నిర్ణయం జరిగినట్లు తెలిసింది. కొన్ని నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై సైతం చర్చించినట్లు చెబుతున్నారు. అలాగూ కులగణనపై ప్రజలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎస్సీ వర్గీకరణపై ఏమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుందనే అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.  

మంత్రుల శాఖల్లో మార్పులు?
కొత్తగా నలుగురిని లేక ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఏయే శాఖలు వారికి కేటాయించాలి, కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలా? కొందరికి కీలక శాఖలు అప్పగించాలా? అన్న దానిపైనా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వద్ద ఉన్న మున్సిపల్, హోం, విద్యా శాఖలను సీనియర్‌ మంత్రులకు ఇవ్వాలన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పాత మంత్రుల శాఖలు కొన్ని మార్చే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement