834 అడుగులు చాలు.. లేదు 854 ఉండాల్సిందే

Conflict Between Telangana And AP States Over Srisailam Reservoir - Sakshi

‘శ్రీశైలం’పై కేబీఆర్‌ఎంసీలో రగడ

విద్యుదుత్పత్తి కోసమే ప్రాజెక్టు నిర్మించారన్న తెలంగాణ

తీవ్ర అభ్యంతరం తెలిపిన ఏపీ

సాగు, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఈఎన్‌సీ

ఏకాభిప్రాయం వ్యక్తమైన అంశాలపై బోర్డుకు నివేదిక: ఆర్కే పిళ్లై

సాక్షి, హైదరాబాద్‌:  శ్రీశైలం జలాశయంపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మళ్లీ తీవ్ర వాగ్వివాదం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టును విద్యుదుత్పత్తి కోసమే నిర్మించారని, జలాశయం నుంచి నీటిని వాడుకోవడానికి ఉండాల్సిన కనీస నీటిమట్టం 834 అడుగులు మాత్రమేనని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ జల వనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి.. శ్రీశైలం ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న జలాల్లో సాగు, తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కిచెప్పారు.

జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు  కనీస మట్టం 854 అడుగుల స్థాయిలో నీటి నిల్వ ఉండేలా చూడాలని సూచించారు. కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్కే పిళ్లై అధ్యక్షతన గురువారం జలసౌధలో కృష్ణా బోర్డు రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) సమావేశం జరిగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల రూల్‌ కర్వ్‌ (నిర్వహణ నియమావళి), జలవిద్యుత్‌ ఉత్పత్తి, వరద జలాల మళ్లింపుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటిమట్టాన్ని 854 అడుగులుగా నిర్ధారిస్తూ సీడబ్ల్యూసీ రూల్‌ కర్వ్‌ రూపొందించిందంటూ ఆర్కే పిళ్లై ఏపీ వాదనను సమర్థించారు. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేస్తేనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లందించగలమని ఏపీ ఈఎన్‌సీ పేర్కొన్నారు. జూలై 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు కాకుండా, ఒకనెల ముందే అంటే.. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు కనీసం 854 అడుగుల్లో నీరు నిల్వ ఉండేలా చూడాలని ఆయన ప్రతిపాదించారు. నాగార్జునసాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

వరద జలాలపై ఏకాభిప్రాయం
జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ అన్ని ప్రాజెక్టులు నిండి.. గేట్లు ఎత్తేసి సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్న సమయంలో మళ్లించే వరద జలాలను వాటా (నికర జలాలు)లో కలపకూడదని ఏపీ ఈఎన్‌సీ కోరారు. దీనిపై తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మళ్లించిన వరద జలాలను నిల్వ చేసుకునే సామర్థ్యం ఏపీకి అధికంగా ఉందని.. కాబట్టి అందులో వాటా ఇవ్వాలని కోరారు.

పిళ్లై జోక్యం చేసుకుంటూ మళ్లించే వరద జలాలను లెక్కిస్తామని, కానీ వాటిని నికర జలాల్లో కలపబోమని స్పష్టం చేశారు. ఇందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన అంశాలపై బోర్డుకు నివేదిక ఇస్తామని, ఈనెల మూడో వారంలో మళ్లీ ఆర్‌ఎంసీ సమావేశం నిర్వహిస్తామని పిళ్లై చెప్పారు.

చెరిసగం విద్యుత్‌పైనే అంగీకారం
–తెలంగాణ ఈఎన్సీ

ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీటిలో 66 శాతం ఏపీ, 34 శాతం తెలంగాణకు వాటా ఉందని.. ఈ లెక్కన శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను 66 శాతం వాటా ఇవ్వాలని ఏపీ ఈఎన్‌సీ డిమాండ్‌ చేశారు. దీనిపై తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఉత్పత్తయ్యే విద్యుత్‌ చెరి సగం పంచుకునేలా మొదట్లోనే అంగీకారం కుదిరిందని అన్నారు. విద్యుదుత్పత్తి అంశం ముగిసిన అధ్యాయమని, దాన్ని మళ్లీ తిరగదోడవద్దని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top