కంటోన్మెంట్‌ విలీనంపై కమిటీ 

Committee Formed To Look Into Secunderabad Cantonment GHMC Merger - Sakshi

కేంద్రం కీలక నిర్ణయం  

నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం 

9న కమిటీ తొలి సమావేశం జరిగే అవకాశం 

‘500 మీటర్ల నిబంధన’ అమలుపై ఆర్మీ ప్రతిపాదన 

కంటోన్మెంట్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని సివిలియన్‌ ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతిపాదన దశలోనే ఉన్న ప్రతిపాదన విధి, విధానాల రూపకల్పనకు ఎనిమిది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోగా ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విలీన ప్రక్రియ కొనసాగనుంది.

రక్షణ శాఖ జాయింట్‌ సెక్రెటరీ, అడిషనల్‌ పైనాన్షియల్‌ అడ్వైజర్‌ చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు సీఈఓ మధుకర్‌ నాయక్‌ వ్యవహరించనున్నారు. వీరిద్దరితో పాటు కంటోన్మెంట్‌ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్‌ సోమశంకర్, రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రెటరీ, తెలంగాణ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ సెక్రెటరీ, డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ అడిషనల్‌ డీజీ, ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌ అడిషనల్‌ డీజీ, డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సదరన్‌ కమాండ్‌ డైరెక్టర్‌లు సభ్యులుగా ఉంటారు. ఫిబ్రవరి 4వ తేదీలోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. 

ఎంఓడీ ప్రతిపాదనకు అనుగుణంగా.. 
కంటోన్మెంట్‌ పరిధిలోని సివిల్‌ ఏరియాలను ఆర్మీ నుంచి విడదీసి సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసుకోవాల్సిందిగా కోరుతూ గతేడాది మే 23న రక్షణ మంత్రిత్వ శాఖకు ఆర్మీ ప్రతిపాదన పంపింది. తదనుగుణంగా రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా, సివిల్‌ ఏరియాలను తమ పరిధిలోనికి తీసుకునేందుకు తెలంగాణ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ తన అంగీకారం తెలుపుతూ గత నెల 14న లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.  

9న తొలి సమావేశం 
విలీనంపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం ఈ నెల9న వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో జరగనుంది. కంటోన్మెంట్‌ పరిధిలోని భూములు, స్థిర, చరాస్థులు, ఉద్యోగులు, పెన్షనర్‌లు, కంటోన్మెంట్‌ నిధులు, పౌర సేవలు, రోడ్లు, ట్రాఫిక్, రికార్డులు, స్టోర్‌ తదితర అన్ని రకాల బదలాయింపుపై రోడ్‌మ్యాప్‌ రూపొందించనుంది. కమిటీ తొలి భేటీకి ముందే రక్షణ మంత్రిత్వ శాఖ ఓ కీలక ఆదేశాన్ని కమిటీ ముందు ఉంచనున్నట్లు తెలిసింది. 

ఇప్పటికంటే కూడా కఠినమైన నిబంధనలు? 
మిలటరీ శిక్షణ కేంద్రాలు, కార్యాలయాలు, స్థలాలకు 500 మీటర్ల పరిధిలో నిర్మాణాలకు సంబంధించి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని నిర్మాణాల విషయంలో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. కంటోన్మెంట్‌లో మాత్రం మినహాయింపు ఉంది. తాజాగా కంటోన్మెంట్‌లోని సివిలియన్‌ ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో కలపనుండటంతో 500 మీటర్ల నిబంధనను ఇక్కడ కూడా అమలు చేస్తామంటూ ఆర్మీ ముందస్తుగానే ప్రకటించింది. దీనికి తోడు ఆర్మీ స్థావరాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలను అనుమతించబోమని కూడా ప్రతిపాదించింది.  ఈ నేపథ్యంలో కంటోన్మెంట్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికంటే కూడా కఠినమైన నిబంధనలు అమలయ్యే అవకాశముంది. 

వికాస్‌ మంచ్‌ హర్షం.. బాణసంచా కాల్చి సంబురాలు 
కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల కంటోన్మెంట్‌ వికాస్‌ మంచ్‌ (సీవీఎం) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీవీఎం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం ఏబెల్, సంకి రవీందర్‌ ఆధ్వర్యంలో పికెట్‌ చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీవీఎం సభ్యులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top