
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మహేశ్‌గౌడ్, మీనాక్షి నటరాజన్, భట్టి, వాకిటి శ్రీహరి
మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం.. ఆ బాధ్యత పార్టీ నేతలదే... ఈ పదేళ్లూ అధికార బాధ్యతలు నేను చూసుకుంటా
టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
పార్టీ నిర్మాణంలో కొత్తగా పదవులు పొందినవారు భాగస్వాములు కావాలని పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని, కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చే బాధ్యత పార్టీ నాయకులదేనని చెప్పారు. ‘1994–2004 వరకు పదేళ్లు టీడీపీ, 2004–2014 వరకు పదేళ్లు కాంగ్రెస్, 2014–23 వరకు తొమ్మిదేళ్లు బీఆర్‌ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. ఇక 2023–33 వరకు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఈ పదేళ్లూ అధికార బాధ్యతలు నేను చూసుకుంటా. పార్టీ కోసం పనిచేసే వారిని కాపాడుకునే బాధ్యత నాది.
మీరు భవిష్యత్తు నాయకులను తయారు చేయండి..’అని సీఎం కోరారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాలిచ్చే కార్యక్రమం మంగళవారం గాం«దీభవన్‌లో జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పార్టీ పదవులు పొందిన వారికి అభినందనలు తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.
పదవులకు న్యాయం చేయాలి..లేదంటే తప్పిస్తారు
‘పార్టీ నిర్మాణంలో కొత్తగా పదవులు పొందినవారు భాగస్వాములు కావాలి. అప్పుడు ప్రభుత్వంలో మీరూ భాగస్వాములవుతారు. రాజకీయంగా ఎదగడానికి ఈ పదవులు, వేదికలే ఉపయోగపడతాయి. ప్రభుత్వ బాధ్యతల కంటే పార్టీ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వేలాది మంది పోటీ పడినా ఈ పదవులు మీకే దక్కినందుకు వాటికి న్యాయం చేయాలి. పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి.
పార్టీలో పనిచేసే వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయి. నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు తీసుకునేందుకు కొందరు అంగీకరించలేదు. అంగీకరించి బాధ్యతలు తీసుకున్నవారు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అయినంత మాత్రాన ఇక రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అవుతుందని అనుకోవద్దు. మీరు ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే రాజకీయంగా ముందుకెళతారు. లేదంటే ఎన్నికల ముందు తప్పిస్తారు..’అని రేవంత్ చెప్పారు.
భవిష్యత్తులో చాలా అవకాశాలు
‘నాయకుల ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మిగిలింది కార్యకర్తల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కష్టపడిన వారికి, కష్టపడి కార్యకర్తలను గెలిపించిన వారికి అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో చాలా పరిణామాలు జరుగుతాయి. డీలిమిటేషన్ జరుగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. మహిళలకు రిజర్వేషన్లు వస్తాయి. 2029లో మీలో చాలామందికి అవకాశాలు వస్తాయి. అప్పటికల్లా సిద్ధంగా ఉండండి..’అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
అలా చేస్తే పార్టీకి తిరుగుండదు: భట్టి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కా లంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామ ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఒక్క సంక్షేమ పథకాల కోసమే రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ నేతలు ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని అన్నారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సలహాదారు షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అవును..అంతా అక్క కష్టమే..
జగ్గారెడ్డి దంపతులపై సీఎం చలోక్తి ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, భట్టి విక్రమార్క, మహేశ్‌గౌడ్, సంపత్‌కుమార్, షబ్బీర్ అలీ, నాయిని రాజేందర్‌రెడ్డిలు పార్టీలో ఎలా ఎదిగారో సీఎం వివరించారు. జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన భార్య నిర్మలా జగ్గారెడ్డికి కీలకమైన టీజీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చామని చెప్పారు. జగ్గారెడ్డి అందులో తనదేమీ లేదని అనడంతో.. ‘అవును.. నిర్మలక్కకు పదవి రావడంలో జగ్గారెడ్డికి సంబంధం లేదు. ఆమె పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కష్టపడ్డారు.. అందుకే పెద్ద కార్పొరేషన్‌కు చైర్మన్ అయ్యారు. అంతా అక్క కష్టమే..’అంటూ సీఎం చలోక్తి విసిరారు.