
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మెరుగైన పారిశ్రామిక విధానాలతో ముందడుగు
బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్
రాబోయే రోజుల్లో డేటా సిటీగా మారనున్న నగరం
జీనోమ్ వ్యాలీలో ‘ఐకార్’ కొత్త యూనిట్‌కు భూమి పూజ
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతో పోటీ పడాలనేదే తమ ప్రభుత్వ ప్రయత్నమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం అధునాతన పారిశ్రామిక విధానాలు తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని, దేశంలో నే 33% టీకాలు, బల్క్ డ్రగ్స్‌లో 43% ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.
రాబోయే రోజుల్లో హైదరాబాద్ డేటా సిటీగా మారనుందని, తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3 లక్షల 28 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. మంగళవారం శామీర్‌పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణలో భాగంగా 1.75 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్న కొత్త ప్లాంట్‌కు మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
జీనోమ్ వ్యాలీతో మంచి గుర్తింపు
దేశంలో జీనోమ్ వ్యాలీలోనే టీకాల ఉత్తత్తి జరుగుతోందని, జీనోమ్ వ్యాలీ తెలంగాణకు మంచి గుర్తింపు తీసుకొచి్చందని రేవంత్‌రెడ్డి చెప్పారు. కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచి ప్రపంచ దేశాలకు టీకాను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే తమ నిర్ణయాలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తోందని, నూతన పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తోందని, వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. రాబోయే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

భూమిపూజ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు వివేక్, శ్రీధర్‌బాబు తదితరులు
గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ: మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ లక్ష్య సాధనలో ఐకార్ రూపంలో మరో అడుగు ముందుకు పడిందని, కొత్తగా 800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో ప్రత్యేకంగా ఫార్మా విలేజెస్‌ను అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు..
యువతకు ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి వివేక్
యువతకు ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. అధిక ఉద్యోగాల కల్పనతో నిరుద్యోగాన్ని తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కువ పరిశ్రమలను స్థాపించడం ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.