సాక్షి, ములుగు జిల్లా: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి రెండో రోజు పర్యటించారు. మంగళవారం వేకువ జామునే కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. తొలిమొక్కును రేవంత్ దంపతులు చెల్లించుకున్నారు. తన ఎత్తు బంగారాన్ని(బెల్లం) ఆయన సమర్పించారు. అంతకు ముందు.. ఆధునీకరించిన మేడారం గద్దెలను సీఎం ప్రారంభించారు.
సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో నిర్మించిన నూతన సాలహారం, ద్వారాలు, ఆర్చీలను సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. సీఎం, మంత్రులను పూజారులు, దేవాదాయశాఖ అధికారులు ఆదివాసీ సంప్రదాయాలు, ఆచారాలతో డోలు వాయిద్యాల నడుమ గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం అమ్మవార్లను దర్శించుకుని బంగారం(బెల్లం) ప్రసాదం స్వీకరించారు.


రాష్ట్ర చరిత్రలో తొలిసారి నిన్న(ఆదివారం) మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం మేడారం ఆలయ ఎగ్జిట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తిలకించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలను చూసి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం హరిత హోటల్‌లో రాత్రి బస చేశారు. ఇవాళ(సోమవారం) ఉదయం సీఎం రేవంత్ సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వన దేవతలకు చీర, సారెలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు.



