రాముడా.. రావణుడా? ఎవరి పాలన కావాలి | CM Revanth Reddy Comments On KCR | Sakshi
Sakshi News home page

రాముడా.. రావణుడా? ఎవరి పాలన కావాలి

Jul 5 2026 1:38 AM | Updated on Jul 5 2026 5:10 AM

CM Revanth Reddy Comments On KCR

మిడ్జిల్‌లో జరిగిన ఆతీ్మయ కృతజ్ఞత సభకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజలే ఆలోచించుకోవాలి.. మిడ్జిల్‌ ఆత్మీయ కృతజ్ఞత సభలో సీఎం రేవంత్‌రెడ్డి

పాపాల భైరవుడు రావాలి.. రావాలి అని కొడుకు, అల్లుడు తిరుగుతున్నారు 

వీళ్లెందుకు మళ్లీ రావాలి?.. ఏం అన్యాయం చేసిందని ప్రజా ప్రభుత్వం పోవాలి? 

2034 వరకు కాంగ్రెస్‌దే అధికారమన్న ముఖ్యమంత్రి 

రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు తనతో కలిసి నడవాలని పిలుపు 

మిడ్జిల్‌ మండలానికి ఏమిచ్చినా, చివరికి తన ప్రాణమిచ్చినా తక్కువేనని వ్యాఖ్య 

మిడ్జిల్‌లో పర్యటన.. అంబేడ్కర్, ధ్యాప గోపాల్‌రెడ్డి విగ్రహాల ఆవిష్కరణ 

రూ.17 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావాలి. దేశంలో రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలి. రాహుల్‌ను ప్రధానిని చేయాల్సిన చారిత్రక అవసరం దేశంలో ఉంది. ఇందుకు తెలంగాణ ప్రజలు అండగా ఉండి.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాందీకి కృతజ్ఞత తెలపాలి. నాతో కలిసి నడవండి.. రాహుల్‌ను ప్రధానిని చేద్దాం. అందుకు మొదటి అడుగు మిడ్జిల్‌ మండలం నుంచే పడాలి.    
 – సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాపాల భైరవుడు రావాలి.. రావాలి అని కొడుకు, అల్లుడు తిరుగుతున్నారని, పదేళ్లలో రూ.8.21 లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్‌ ప్రజలకు ఏం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. ‘మీ ఊళ్లలో ఎవరికైనా డబుల్‌ బెడ్రూమ్‌లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు ఇచ్చారా? కోటి ఎకరాలకు నీళ్లు అందించారా? ఎందుకు వీళ్లు మళ్లీ రావాలి?..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనను రావణుడితో, కాంగ్రెస్‌ పాలనను రాముడి పాలనతో పోలుస్తూ.. రాముడి పాలన కావాలా.. రావణుడి పాలన కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్‌రెడ్డి శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లో పర్యటించారు. 

ముందుగా నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఆత్మీయులతో ముచ్చటించారు. ఆ తర్వాత డీసీసీబీ మాజీ చైర్మన్‌ ధ్యాప గోపాల్‌రెడ్డి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మిడ్జిల్‌ మండలంలోని 40 గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఊర్కొండ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లతో శిలాఫలకం ఆవిష్కరించారు. సుమారు రూ.17 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ కృతజ్ఞత వందన సభలో మాట్లాడారు.  

ఏం చేశారని మీకు లక్షల కోట్లు వచ్చాయి? 
‘పదేళ్లలో ఏం వ్యాపారం చేశారని మీకు, మీ కుటుంబాలకు లక్ష కోట్లు వచ్చాయి. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పులు ఎలా మిగిలాయి? బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఫామ్‌హౌస్‌లో పండించిన గంజాయి, డ్రగ్స్‌ను రైతు బజార్లలో పెట్టి అమ్ముతారు. మీతో పాటు పాటు దోపిడీ చేసిన ఆఫీసర్లను నిన్న మొన్న ఏసీబీ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల అక్రమ సంపాదన బయట పడుతోంది. వీళ్లకు ఈ సొమ్ము ఎక్కడిది? ప్రజల నుంచి దోచుకున్నదే కదా. కేసీఆర్‌కు గజ్వేల్, ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫాంహౌస్‌ ఎక్కడి నుంచి వచ్చింది?  కేటీఆర్‌కు జన్వాడలో వంద ఎకరాలు, హరీశ్‌రావుకు మొయినాబాద్‌లో 50 ఎకరాలు, కల్వకుంట్ల కవితకు శంకర్‌పల్లిలో 25 ఎకరాల ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ షడ్డకుడి కొడుకు సంతోష్‌రావుదైతే లెక్కలు చెప్పనికే లేదు. ఇంత సంపాదన ఈ పదేళ్లలో ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడివి ఈ ఆస్తులు? ఎక్కడ సంపాదించారు. ఎందుకు తెలంగాణ అప్పుల పాలైంది?  

మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే.. 
బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గులు, నీచులు. వాళ్ల సంపాదన, దోపిడీ, దొంగతనాలు ఆగిపోయాయనే మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అప్పులు, తప్పులు చేసినవాళ్లు మళ్లీ వస్తే రాష్ట్రంలో ఫోన్‌ కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేరు. ఆడబిడ్డల మాటలు దొంగతనంగా వినేవాడు అసలు మనిõÙనా? అసెంబ్లీకి రాడు.. ప్రజాసమస్యలు ప్రస్తావించడుం. అధికారం ఇస్తే దోచుకోవడానికి మాత్రం వస్తాడట. పదేళ్లలో రాష్ర్టంలో ఆయన చేసింది ఏమంటే ఇసుక దోపిడీకి అడ్డుపడిన నేరెళ్ల దళితులపైకి లారీలు ఎక్కించుడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైళ్లలో పెట్టించుడు. ప్రశ్నలు, ప్రశ్నపత్రాలను పల్లీ, బఠానీల మాదిరి అమ్ముకున్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదు. 

పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? 
ఆ పశుపతి ఫామ్‌హౌస్‌లోనే కుంగికృశించి పోవాల్సిందే. అధికారం అనేది ఇక వాళ్లు మరిచిపోవాల్సిందే. నల్లమల నుంచి వచ్చిన నాకు ఏమీ తెలియదని కొందరు అవహేళన చేశారు. పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? అహంకారానికి, అహంభావానికి ఒక హద్దు ఉంటుంది. ప్రజాయుద్ధ నౌక, పేదల గళం గద్దర్‌ను గడీల ముందు నిలబెట్టిన మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే..’ అంటూ సీఎం మండిపడ్డారు. 

కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన ఖర్చేందో తేల్చండి 
‘ఏం అన్యాయం చేశామని ప్రజా ప్రభుత్వం పోవాలి. గంజాయి, డ్రగ్స్‌ అమ్మే వాళ్లను జైల్లో పెట్టినందుకా? ధాన్యం చివరి గింజ వరకు కొని రైతుల ఖాతాల్లో రూ.80 వేల కోట్లు వేసినందుకా? 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్‌కార్డులు, సన్న బియ్యం ఇచ్చినందుకా? రైతు రుణమాఫీ చేసినందుకా? సన్న వడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చింది వాస్తవం కాదా? జనగణనలో కులగణన చేసి వందేళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదా?కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో రైతు భరోసా కోసం రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సరాసరి ప్రతి నెలా రూ.5,600 కోట్లు మేం ఖర్చు చేస్తున్నాం. పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఖర్చు చేసిందేందో లెక్కలు తేల్చండి. నా ఆత్మ బంధువులు మిడ్జిల్‌ ప్రజల మధ్య నుంచి చెబుతున్నా. 2034 వరకు కాంగ్రెస్‌దే అధికారం..’ అని రేవంత్‌ అన్నారు. 

రబ్బానీకి పదవి ఇవ్వాలి.. మిడ్జిల్‌ను దత్తత తీసుకోవాలి 
‘2006 జూలై 2 నాడు మిడ్జిల్‌ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు మహావృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచింది. ఆనాడు జెడ్పీటీసీగా నా గెలుపు నాది కాదు.. ఈ మిడ్జిల్‌ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్పది. అయితే నా వల్ల ఎవరికీ కష్టం, నష్టం రాకూడదన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు జెడ్పీ చైర్మన్‌ రేసులో నిలిచి జెడ్పీటీసీ అభ్యరి్థగా నాపై ఓడిన రబ్బానీకి ఈ రోజు ఒక మంచి పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు సూచిస్తున్నా. నా బాధ్యతను నెరవేర్చేందుకు మిడ్జిల్‌ను దత్తత తీసుకోవాలని భట్టిని కోరుతున్నా. మిడ్జిల్‌ మండలానికి ఏమిచ్చినా, చివరికు నా ప్రాణమిచ్చినా తక్కువే..’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

సీఎం కాన్వాయ్‌కు ట్రాఫిక్‌ చిక్కులు 
శంషాబాద్‌ రూరల్‌: మిడ్జిల్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు శనివారం ట్రాఫిక్‌ చిక్కులు ఎదురయ్యాయి. దీంతో బెంగళూరు జాతీయ రహదారిపై ఆయన వాహన శ్రేణి నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. రాత్రి 7.35 గంటల సమయంలో శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  కాన్వాయ్‌ వెళ్తుండగా.. హైవేపై ట్రాఫిక్‌ జాంను క్లియర్‌ చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు విన్పించాయి.  

ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం: భట్టి  
ప్రజలకు మంచి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా సమస్యలను దగ్గరగా చూసిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారులపైనే ఆధారపడి పాలన సాగించడం లేదని, ప్రజలకు దగ్గరగా సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం ఓట్లు వేసి జెడ్పీటీసీగా గెలిపించిన ప్రజలను మర్చిపోకుండా వారందరికీ కృతజ్ఞతలు తెలపడం మంచి సాంప్రదాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరు«ద్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, రాజేష్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, కార్పొరేషన్‌ చైర్మన్‌లు శివసేనారెడ్డి, కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement