
ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజి్రస్టార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మహేందర్‌రెడ్డి, పొంగులేటి, శ్రీధర్‌బాబు తదితరులు
365 రోజులూ గోదావరి నీళ్లు పారేలా చేస్తాం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
గచ్చిబౌలి: గోదావరి నదీ జలాలతో మూసీ నది ఏడాదంతా పారేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గోదావరి నుంచి 35 టీఎంసీల నీటిని గండిపేట, హిమాయత్‌సాగర్‌కు తరలించి 365 రోజులూ మూసీ నది స్వచ్ఛమైన నీటితో ప్రవహించేలా చర్యలు చేపడతామని చెప్పారు. మూసీ సుందరీకరణ, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీలను ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, మెట్రో రైల్ విస్తరణతో హైదరాబాద్‌లో రాత్రి సమయంలో కూడా మూసీ పరీవాహక ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తా మని చెప్పారు.
బుధవారం గచ్చిబౌలిలోని తాలింలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని తెలిపారు. 1994 నుంచి 2014 వరకు పనిచేసిన ముఖ్యమంత్రులు హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు.
ప్రపంచం చూపు హైదరాబాద్ వైపు..
తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. 2034 నాటికి ప్రపంచమంతా హైదరాబాద్ నగరం వైపు చూస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హైటెక్‌సిటీకి పునాది వేసినప్పుడు కొందరు దానిని హేళన చేశారు.
నేడు మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ కూడా కొందరికి ఇష్టం లేక విమర్శలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చూన్ –500 జాబితాలోని కంపెనీల్లో హైదరాబాద్‌లోనే 85 ఉన్నాయి. ఐటీ కంపెనీల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.వేల కోట్ల ఆదాయం వస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు. అదే ఒరిజినల్ సిటీ’అని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో..
ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చే సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో ప్రజలు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉందని సీఎం అన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో సకల సౌకర్యాలతో అత్యాధునిక సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కోర్ అర్బన్ ప్రాంతంలో 39 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, 11 ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.
ఎనిమిది నెలల్లో రూ.30 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో అపర్ణ ఇన్‌ఫ్రా సంస్థ గచి్చబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాన్ని నిర్మిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 2 నాటికి మిగిలిన 10 భవనాల నిర్మాణం పూర్తిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు.
రోల్ మోడల్‌గా భూభారతి
ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేసి రెవెన్యూ సంస్కరణల్లో రోల్ మోడల్‌గా భూభారతిని తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై భారం పడకుండా సీఎస్‌ఆర్ నిధులతో ఆయా కంపెనీల సహకారంతో ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గచ్చిబౌలి తాలింలో రూ.30 కోట్లతో మూడు ఎకరాల విస్తీర్ణంలో భవనం నిర్మిస్తామని తెలిపారు.
భవనంలో డీఆర్‌ఓ, ఆరుగురు ఎస్‌ఆర్‌ఓల ఆఫీసులు, వెయిటింగ్ హాల్, టోకెన్ సిస్టమ్, వివాహ రిసెప్షన్ కోసం ప్రత్యేక హాల్, ఫీడింగ్ రూమ్, చిన్నారుల కోసం క్రష్ సెంటర్, వృద్ధుల కోసం ర్యాంప్, వీల్‌చైర్ సదుపాయం, 300 కార్లకు పార్కింగ్, గ్రీన్ బిల్డింగ్, సెల్లార్ సిస్టమ్, కేఫ్ ఉంటాయని చెప్పారు. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఆస్తుల రిజి్రస్టేషన్ ప్రక్రియలో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు.