Mukarram Jha: నిజాం రాజు ముకరం జాకు సీఎం కేసీఆర్‌ నివాళులు..

CM KCR Tributes To Eighth Nizam King Mukarram J‍ha - Sakshi

శంషాబాద్‌/చార్మినార్‌: టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఈ నెల 14న తుదిశ్వాస విడిచిన ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్‌ పార్థివదేహం మంగళవారం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇస్తాంబుల్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తెచ్చారు. భారీ బందోబస్తు నడుమ చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. రాత్రి 7 గంటలకు ముకరంజా భౌతికకాయాన్ని సందర్శించి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అలాగే మంత్రులు మహ్మద్‌ మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌ రెడ్డితోపాటు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు ముకరంజా భౌతికకాయానికి నివాళులర్పించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్యాలెస్‌ లో ముకరంజా భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ప్రజలను అనుమతించనున్నారు. మధ్యాహ్నం ప్యాలెస్‌ నుంచి మక్కా మసీదు వరకు నిజాం అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. మక్కా మసీదులో తన పూర్వీకులైన నిజాం సమాధుల పక్కన ముకరంజా పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.  

1967లో ఎనిమిదో నిజాంగా..  
భారత యూనియన్‌లో హైదరాబాద్‌ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్‌ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్‌ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్‌ 6, 1967లో ఎనిమిదవ అసఫ్‌ జాహీగా ముకరం జాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్‌ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా 1967 భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top