ఫలించిన సీఎం కేసీఆర్‌ వ్యూహం

CM KCR Strategy Over Fire Service At Hospital In Hyderabad - Sakshi

సాక్షి, గాంధీఆస్పత్రి (హైదరాబాద్‌): సీఎం కేసీఆర్‌ వ్యూహం ఫలించింది. ముందు జాగ్రత్తతో చేపట్టిన ఆలోచన విధానం సత్ఫలితాలను ఇచ్చింది. వందలాది మంది రోగులు, వైద్యులు, సిబ్బంది పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో కోవిడ్‌ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు సంభవించి తీవ్రమైన ప్రాణ, ఆస్తినష్టాలు వాటిల్లాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో జరిగిన అగ్నిప్రమాదాలను గమనించిన సీఎం కేసీఆర్‌ ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తెలంగాణలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో అగ్నిమాపకలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేవలం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఏర్పాటు పనులను నిరంతరం సమీక్షించారు.  

► గాంధీఆస్పత్రి ప్రాంగణంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 24న అగ్నిమాపక కేంద్రం అందుబాటులోకి  వచ్చింది.  
► నాటి ఆదేశాలే నేడు ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు దోహదపడ్డాయని పలువురు భావిస్తున్నారు. 
► సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో ఫైర్‌ సిబ్బంది పనితీరుపై ప్రశంసలజల్లు కురుస్తున్నాయి.  
► సమాచారం అందిన మూడు నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది ఘటనస్ధలానికి చేరుకుని కొన్ని నిమిషాల వ్యవధిలో మంటలను అదుపు చేశారు. 
► ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం నుంచి బయట పడ్డామని పలువురు వైద్యులు, సిబ్బంది, రోగులు తెలిపారు.  
► ఆస్పత్రి ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయకపోతే, ఇతర ప్రాంతాల నుంచి ఫైర్‌ ఇంజన్‌ వచ్చేందుకు కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేదని, ఈ వ్యవధిలో మంటలు మరింత విజృంభించి ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని, సీఎం కేసీఆర్‌ చేపట్టిన చర్యలే తమ ప్రాణాలు కాపాడాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  
► నగరంలోని పలు ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రాలు తెలంగాణ సెక్రటేరియట్‌ కేంద్రంగా పనిచేస్తున్నాయి.  

కార్బన్‌ స్మోక్‌  ప్రమాదకరం
గాంధీ ఆస్పత్రిలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సకాలంలో స్పందించాం, విద్యుత్‌ కేబుళ్లు వైర్లను కార్బన్‌తోపాటు పలు రకాల కెమికల్స్‌తో తయారు చేస్తారు. ఇవి కాలుతున్న సమయంలో విపరీతమైన పొగను వెలువరిస్తాచి. ఈ పొగ ఎక్కువగా పీల్చితే ప్రాణాపాయం కలుగుతుంది. మేము మూడు నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలానికి చేరుకున్నాం.

అప్పటికే పలు వార్డులు పొగతో నిండి ఉంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలతోపాటు రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న రోగులపై కార్బన్‌ పొగ తీవ్రమైన ప్రభాపం చూపించే ప్రమాదం ఉంది. ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఫైర్‌ ఇంజన్లు ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో పెను ప్రమాదం తప్పింది.  

 – కేవీ నాగేందర్, ఫైర్‌ ఆఫీసర్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top