సఫాయి కార్మికులకు పీఆర్సీ తరహా జీతభత్యాలు: సీఎం కేసీఆర్‌

CM KCR Intresting Comments On Safai Workers In Opposition Party Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 'సఫాయన్న నీకు సలాం అన్న .. అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్ చేయకున్నా  ప్రతీసారీ  సఫాయి కార్మికుల జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం’ అంటూ ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు.

అఖిల పక్ష భేటీలో ఆయన సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలన్నారు. ఈ సందర్భంగా లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికదిగా సిద్ధం చేసుకోవాలన్నారు. 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమష్టి కార్యాచరణ అందరం కలిసి చేపట్టాలని అఖిల పక్ష నేతలతో  కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

ప్రాజెక్టులు తదితర ప్రజావసరాల కోసం భూసేకరణలో భాగంగా సేకరించాల్సి వచ్చిన అసైన్డ్ భూములకు కూడా, పట్టాభూములకు చెల్లించిన ఖరీదునే ప్రభుత్వం చెల్లిస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్‌ స్పష్టం చేశారు. దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం కోసం ఈ బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. ఎటువంటి బ్యాంక్ గారెంటీ జంజాటం లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సహకారం అందిస్తామన్నారు. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచంలో, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు. అందుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

చదవండి: సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top