ఆగస్టులోగా ‘పాలమూరు’ తాగునీళ్లు!  | CM KCR first review of Palamuru-Ranga Reddy project in new secretariat | Sakshi
Sakshi News home page

ఆగస్టులోగా ‘పాలమూరు’ తాగునీళ్లు! 

May 2 2023 3:38 AM | Updated on May 2 2023 9:31 AM

CM KCR first review of Palamuru-Ranga Reddy project in new secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘పాలమూరు’ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి వచ్చే ఆగస్టులోగా ఉమ్మడి మహ­బూ­బ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని అందిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తెలి­పా­రు. ఇందుకు అనుగుణంగా జూలై నాటికి కరివెన జలా­శయానికి, తర్వాతి నెలరోజుల్లో ఉద్ధండాపూర్‌ జలాశయానికి నీళ్లను ఎత్తిపోసేలా ఏర్పా­ట్లు చే­యా­లని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నా­ర్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్‌ జలాశయాల మిగులు పనులను వేగంగా పూర్తి చే­యాలని స్పష్టం చేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ నూతన సచివాలయంలో సోమవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్‌ తొలి సమీక్ష నిర్వహించారు. తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు పనులను కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో.. అందుకు సంబంధించిన పనుల పురోగతిపై కూలంకంషంగా చర్చించారు. జలాశయాల పంపుహౌజ్‌లు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, కన్వేయర్‌ సిస్టమ్‌లో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇక పాలమూరు జిల్లాలోని ఇతర ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్‌ సాగర్‌ పనుల పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. వాటిలో మిగిలిన కొద్దిపాటి పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీ మురళీధర్‌రావు, అడ్వైజర్‌ పెంటారెడ్డి, మిషన్‌ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

ద్వితీయం పూజల్లో పాల్గొన్న సీఎం 
నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్‌ సోమవారం బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన తూర్పు ప్రధానద్వారం ద్వారా సచివాలయంలోకి ప్రవేశించారు. నేరుగా యాగశాలకు చేరుకున్నారు. అక్కడ వేదపండితులు నిర్వహించిన ద్వితీయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆరో అంతస్తుకు చేరుకున్నారు.

తన కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, పీఆర్వో కార్యాలయాలను పరిశీలించారు. కారిడార్లలో కలియదిరిగారు. అనంతరం తన చాంబర్‌లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5.20 గంటల ప్రాంతంలో తిరిగి ప్రగతిభవన్‌కు బయలుదేరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement