కేటీఆర్‌ అంకుల్‌.. కాలనీకి నల్లానీరు ఇప్పించరూ

Children Day Little Boy From Hyderabad Asks KTR For Municipal Water - Sakshi

బాలల దినోత్సవాన ప్లకార్డు చేతబూని వీడియోలో ఓ బాలుడి కోరిక

కేటీఆర్‌కు ట్వీట్‌ చేసిన ఓ నెటిజన్‌.. తక్షణమే స్పందించిన మంత్రి

బాలుడు ఉమర్‌ ఉండే కాలనీని సందర్శించాలని జలమండలి ఎండీకి ఆదేశం

అప్పటికప్పుడు కాలనీలో పర్యటించిన దానకిశోర్‌.. 2 వారాల్లో సమస్య పరిష్కారానికి హామీ

సాక్షి, హైదరాబాద్‌: బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నివసించే ఉమర్‌ అనే బాలుడు మున్సిపల్‌ శాఖ మంత్రి కె. తారక రామారావును కోరిన చిరుకోరిక తక్షణమే నెరవేరింది. నగరంలోని రాజేంద్రనగర్‌ గోల్డెన్‌ సిటీలో పిల్లర్‌ నంబర్‌ 248 వద్ద నివసిస్తున్న తాము ఐదేళ్లుగా మున్సిపల్‌ నీటి కనెక్షన్‌ కోసం నిరీక్షిస్తూ ఎన్నో సమస్యలు పడుతున్నామంటూ చిన్నారి ఉమర్‌ ఓ వీడియోలో ప్లకార్డు ప్రదర్శించాడు.

ఈ వీడియోను ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌కు సోమవారం ట్వీట్‌ చేయడంతో ఆయన దీన్ని చూసి తక్షణమే స్పందించారు. బాలుడు నివసించే కాలనీకి ప్రత్యక్షంగా వెళ్లి సమస్యను పరిష్కరించాలని జలమండలి ఎండీ దానకిశోర్‌ను ఆదేశించారు. దీంతో ఎండీ సోమవారం గోల్డెన్‌ సిటీ కాలనీలో పర్యటించారు. బాలుడు ఉమర్‌తోపాటు కాలనీవాసులను కలిసి సమస్యను తెలుసుకున్నారు. తక్షణం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే ఈ కాలనీలో నల్లా పైప్‌లైన్‌ ఏర్పాటుకు జలమండలి రూ. 2.85 కోట్లను మంజూరు చేసిందని... ఇటీవల వర్షాల కారణంగా రోడ్‌కటింగ్‌ అనుమతులు లేకపోవడంతో పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రెండు వారాల్లో పైప్‌లైన్‌ పనులు పూర్తి చేసి నల్లా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా కాలనీకి నీటి సరఫరా కొనసాగిస్తామన్నారు.

బాలుడు ఉమర్‌ తమ కాలనీ నీటి సమస్యను వివరించిన నాలుగు గంటల్లోపే మంత్రి కేటీఆర్‌ స్పందించడం, జలమండలి ఎండీ దానకిశోర్‌ నేరుగా గోల్డెన్‌ సిటీ కాలనీకి వెళ్లి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం చకచకా జరిగిపోవడం విశేషం. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కేటీఆర్‌ అత్యంత ప్రాధాన్యతనివ్వడం నగరంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top