పిల్లలకు తిండి పెట్టలేని మాకు..ఆత్మహత్యే శరణ్యం! 

Chaitanyapuri: Sri Chaitanya College Lecturer Suicide Attempt - Sakshi

మూడో రోజుకు చేరుకున్న శ్రీచైతన్య అధ్యాపకుల ఆందోళన

లెక్చరర్‌ ఆత్మహత్యాయత్నంతో ఉద్రిక్తత 

సాక్షి, చైతన్యపురి: బకాయి జీతాలు చెల్లించాలని... తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ చైతన్యపురిలోని శ్రీ చైతన్య కళాశాల పాకాల ప్లాజా బ్రాంచ్‌ లెక్చరర్ల ఆందోళన మూడో రోజుకు చేరుకుంది. సుమారు 45 మంది లెక్చరర్లు చేస్తున్న ధర్నాకు ప్రైవేట్‌ లెక్చరర్ల సంఘంతో పాటు పలు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కూడా తమకు లాక్‌డౌన్‌లో చెల్లించాల్సిన సగం జీతం చెల్లించకపోవటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సీనియారిటీ ఉండి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లు, ఇంజినీర్లుగా చేయటంలో విద్యాబుద్ధులు నేరి్పన లెక్చరర్లను పక్కన పెట్టి ఫ్రెషర్స్‌ను తీసుకోవటం అన్యాయమని అన్నారు. జీతాలు లేక కుటుంబ సభ్యులను పస్తులుంచాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోయారు. 

లెక్చరర్‌ ఆత్మహత్యాయత్నం... 
శ్రీచైతన్య కళాశాల వద్ద నిరాహార దీక్షలో జువాలజీ లెక్చరర్‌ డాక్టర్‌ హరినాథ్‌ బలవన్మరణానికి యత్నించటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో తోటి అధ్యాపకులు అతడిని అడ్డుకున్నారు. 25 సంవత్సరాలు అధ్యాపకుడిగా సేవలు అందించిన తనకు జీతాలు చెల్లించడం లేదన్నారు. భార్య, పిల్లలకు ఒక్కపూట కడుపునిండా తిండిపెట్టలేని తనకు ఆత్మహత్యే శరణ్యమని హరినాథ్‌ విలపించాడు. వయసు కారణంగా చూపి కళాశాల డీన్‌ రవికాంత్‌ వేధింపులకు గురి చేసి తనను విధుల్లోకి తీసుకోలేదన్నారు. ఆత్మహత్యాయత్నం సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హరినాథ్‌ను స్టేషన్‌కు తరలించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో ప్రశాంత్, భగవంత్‌రెడ్డి, చందు, మహేష్‌, నిర్సింహ, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. 
చదవండి: శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా

యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: పేరాల శేఖర్‌రావు 
చైతన్యపురి: లెక్చరర్లను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు, వీహెచ్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌ డిమాండ్‌ చేశారు. హరినాథ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందుకున్న వారు గురువారం చైతన్యపురి పీఎస్‌కు చేరుకుని ఇన్‌స్పెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు, లెక్చరర్ల భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్న కార్పొరేట్‌ కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, ఇంటర్‌ బోర్డు అధికారులు కనీసం స్పందించకపోవటం సిగ్గు చేటన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. లెక్చరర్‌ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top