మజ్లిస్‌తో టీఆర్‌ఎస్‌‌ పొత్తుపై మండిపడ్డ కిషన్‌రెడ్డి

Central Minister Kishan Reddy Slams TRS, MIM Alliance - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎంఐఎంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అనైతిక పొత్తు కుదుర్చుకోవడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు మజ్లిస్‌తో విభేదించినట్లు నటించిన కారు పార్టీ.. మేయర్‌ ఎన్నిక సందర్భంగా వారి సహాయం తీసుకోవడంపై ఆయన ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న అనైతిక సంబంధాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక జరిగిన ప్రక్రియను బట్టి చూస్తే, కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలోనే ఉందని మరోమారు బహిర్గతమైందన్నారు.

టీఆర్ఎస్, మజ్లిస్‌ పార్టీలతో హైదరాబాద్ అభివృద్ధి చెందదని, మజ్లీస్‌కు హైదరాబాద్ అభివృద్ధితో అసలు అవసరమే లేదని ఆయన విమర్శించారు. హిందూ దేవుళ్లను, హిందువులను అవహేళన చేసే మజ్లిస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర క్యాబినెట్‌తో చర్చించకుండా, కేవలం మజ్లీస్ సూచనల మేరకే కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాదులో పోలీసులు ఎవరు ఉండాలి, అధికారులు ఎవరు ఉండాలనేది మజ్లీస్ పార్టీనే నిర్ణయిస్తుందన్నారు. మజ్లీస్ అడ్డు పడడం వల్లే మెట్రో పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. కశ్మీర్‌లో పీడీపీతో పొత్తు వేరే అంశమని పేర్కొన్నారు. రానున్న ఎంఎల్‌సీ ఎన్నికల్లో రెండు సీట్లలో బీజేపీదే విజయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top