
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 800 రకాల అత్యవసర మందుల ధరలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జ్వరం, బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ మందులన్నింటి ధరలు 12.12 శాతం పెరుగుతాయని కేంద్రం వెల్లడించింది. దీని వల్ల ప్రతి ఒక్కరూ ప్రభావితమవుతారని, ఎక్కువ మందులు తీసుకునే వ్యక్తులపై భారం పడుతుందని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ సంజయ్‌రెడ్డి అన్నారు. రక్త హీనత, మధుమేహం, గుండె జబ్బులకు వాడే అత్యవసర ఔషధాలు, అంటువ్యాధులు, చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు, టీబీ, వివిధ రకాల కేన్సర్లకు రోగులు ఉపయోగించే మందుల ధరలు పెరుగుతాయని చెపుతున్నారు.
అలాగే మెడికల్ డివైజ్‌ల ధరలు కూడా భారీగా పెరుగుతాయని, జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి (ఎన్‌పీపీఏ) వీటి ధరలను పెంచిందని సంజయ్ పేర్కొన్నారు. అసలే కరోనా తర్వాత అనేకమంది పలు సైడ్‌ఎఫెక్ట్స్‌కు గురయ్యారు. దీంతో అనేకమంది నిత్యం పలు రకాల మందులు వాడుతున్నారు. మందుల ధరల పెంపువల్ల ఆదాయంలో కొంత భాగం వాటికి అదనంగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు.
డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్, 2013 ప్రకారం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) సరళిని బట్టి ఈ ధరలు నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గతేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం పెంచింది. కాగా, ఏయే మందుల ధరలు పెరిగాయో వాటి జాబితాను కేంద్రం ఒకటిరెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని సంజయ్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment