క్యాబ్‌.. బేజార్‌!... భరోసా లేని ప్రయాణం

Cabs Do Not Guarantee Travel And Passngers Feel Insecurity - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌కు చెందిన రాజేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి  శంషాబాద్‌ సమీపంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. మధ్యాహ్నం  ఏ ఇబ్బంది లేకుండా  క్షణాల్లోనే క్యాబ్‌ బుక్‌ అయింది. భార్యా పిల్లలతో కలిసి సంతోషంగా బయలుదేరాడు. సాయంత్రం  6 గంటలకు శంషాబాద్‌ నుంచి తిరిగి బయలు దేరేందుకు క్యాబ్‌ కోసం ప్రయత్నించాడు. రద్దీ సమయం కావడంతో క్యాబ్‌ బుకింగ్‌కు పది నిమిషాలు పట్టింది. ‘హమ్మయ్య ఏదో ఒక విధంగా క్యాబ్‌ బుక్‌ అయింది. ఇక వెళ్లిపోవచ్చు’ అనుకుంటుండగా  క్యాబ్‌  డ్రైవర్‌ ఫోన్‌ చేశాడు. ఎక్కడెళ్లాలి అని  అడిగాడు. హిమాయత్‌నగర్‌కు అని చెప్పడంతో ఫోన్‌ పెట్టేశాడు. గంట గడిచినా  క్యాబ్‌ రాలేదు. బుకింగ్‌ రద్దు కాలేదు.  మరో క్యాబ్‌ కోసం  ప్రయత్నించాడు.

క్యాబ్‌ డ్రైవర్‌  రూ.1000 డిమాండ్‌ చేశాడు. బుకింగ్‌ రద్దు చేసుకొంటే  వస్తానన్నాడు.మరో గత్యంతరం లేకపోవడంతో  డ్రైవర్‌ డిమాండ్‌కు అంగీకరించవలసి వచ్చింది. ఇది ఒక్క రాజేశ్‌ కు ఎదురైన అనుభవం మాత్రమే కాదు. ఓలా, ఉబెర్‌ క్యాబ్‌లు సా గిస్తున్న  నయా దందా ఇది. ప్రయాణికులను ఠారెత్తిస్తున్నారు. చివరినిమిషంలో రైడ్‌లను రద్దు చేసుకొనే విధంగా ఒత్తిడి తెస్తున్నారు. అడిగినంతా ఇస్తే  ఓకే అంటున్నారు. దీంతో క్యాబ్‌ ఉందనే భరోసాతో భార్యా పిల్లలతో కలిసి  ఇంటి నుంచి బయటకు వస్తున్న  వారు ఆ తరువాత తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఒక్క శంషాబాద్‌ రూట్‌లోనే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ  కొంతకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది.  

భరోసాలేని క్యాబ్‌ జర్నీ... 
సాధారణంగా ఉదయం,సాయంత్రం వేళల్లో  రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో క్యాబ్‌ బుకింగ్‌లకు కొంత సమయం పట్టవచ్చు. ఏదో ఒకవిధంగా క్యాబ్‌ బుక్‌ చేసుకొని వెళ్లొచ్చని భావించే  ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల  ప్రయాణికులకు ఇలా చివరి నిమిషంలో రైడ్స్‌ రద్దు కావడంతో తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. ‘క్యాబ్‌ల వల్ల  ప్రయాణానికి  భరోసా లభించడం లేదని, డ్రైవర్‌లకు గిట్టుబాటయితేనే  వస్తారని’ అంబర్‌పేట్‌కు చెందిన రాజు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది డ్రైవర్‌లు తాము రావడం లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. మరి  కొందరు రైడ్‌ రద్దు చేసుకొని తాము అడిగినంతా నగదు రూపంలోనే చెల్లిస్తే వస్తామని పేచీ పెడుతున్నారు. దీంతో  తప్పనిసరి పరిస్థితుల్లో   డ్రైవర్‌లు డిమాండ్‌ చేసినంత చెల్లించవలసి వస్తుంది. ‘ఇలాంటి  క్యాబ్‌ డ్రైవర్‌లపైన ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని’ మల్కాజిగిరికి చెందిన సతీష్‌ అభిప్రాయపడ్డారు.  

కమిషన్‌లు తగ్గినందుకే ఇలా... 
ఓలా, ఉబెర్‌ సంస్థలు  డ్రైవర్‌లకు కమిషన్‌ల రూపంలో చెల్లిస్తాయి. ప్రతి  కిలోమీటర్‌కు కొంత మొత్తాన్ని  డ్రైవర్‌ల ఖాతాలో జమ చేస్తారు. కానీ ఇలా కమిషన్‌ రూపంలో వచ్చే ఆదాయం తమకు ఏ మాత్రం చాలడం లేదంటూ డ్రైవర్లు నేరుగా  ప్రయాణికులతో బేరాలకు దిగుతున్నారు. ఓలా, ఉబెర్‌ల నుంచి రైడ్‌  బుకింగ్‌లు వచ్చే వరకు ఎదురు చూసి ఆ తరువాత ఈ తరహా బేరసారాలను కొనసాగిస్తున్నారు.  

డిజిటల్‌ అయితే నో... 

  • సదరు ఓలా, ఉబెర్‌ క్యాబ్‌ సంస్థలతో  తమ కమిషన్‌లపైన  ఒప్పందం చేసుకోవలసిన డ్రైవర్‌లు  ప్రయాణికులను  ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  
  • సాయంత్రం  6  దాటితే చాలు. రద్దీ  ఉండే రూట్ల లో క్యాబ్‌లు బుక్‌ కావడం లేదు. ఒకవేళ  అయినా  ‘డిజిటల్‌ పేమెంట్స్‌’ అనగానే  నిరాకరిస్తున్నారు.  
  • ఓలా, ఉబెర్‌ యాప్‌లలో   రెంటల్‌ బుకింగ్స్‌ సదుపాయం ఉన్నట్లు  కనిపిస్తుంది. కానీ ఆన్‌లైన్‌లో రెంటల్‌ బుకింగ్స్‌కు డ్రైవర్‌లు నిరాకరించడం గమనార్హం.  
  • శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులను కూడా  క్యాబ్‌లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.  
  • చివరి నిమిషంలో రైడ్‌ల రద్దు వల్ల  దిక్కుతోచని పరిస్థితుల్లో పడాల్సి వస్తుందని  ప్రయాణికులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
  • ఓలా, ఉబెర్‌ ఇబ్బందుల  దృష్ట్యా  కొద్ది రోజుల క్రితం ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ క్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు.   
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top