
కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా
కేసీ, మహేశ్‌గౌడ్‌తోనే రాహుల్ చర్చలు
సామాజికవర్గాలు,జిల్లాల వారీగా ఆశావహుల ఎంపికపై భిన్నాభిప్రాయాలు
ఏఐసీసీ ఆలోచనలకు, పీసీసీ ప్రతిపాదనలకు, సీఎం ఉద్దేశాలకు మధ్య వైరుధ్యం!
ఒకరిద్దరి విషయంలో రేవంత్, ఏఐసీసీ పెద్దల పట్టుదల
బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్న మహేశ్‌గౌడ్
ఢిల్లీలోనే ఉన్నా సమావేశానికి దూరంగా ముఖ్యమంత్రి
రాహుల్‌తో చర్చల సారాంశాన్ని సీఎంకు వివరించిన పీసీసీ చీఫ్
హైదరాబాద్‌కు రేవంత్..ఢిల్లీలోనే మహేశ్‌గౌడ్
30న మరోసారి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు మళ్లీ అసంపూర్తిగానే ముగిశాయి. ఆశావహుల తుది జాబితాపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. సామాజిక సమీకరణాల మేరకు తుది జాబితాను ఖరారు చేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై మరోసారి భేటీ కావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించినట్లు సమాచారం. దీంతో కేబినెట్ విస్తరణపై ఏదో ఒకటి తేల్చుకుని హైదరాబాద్ తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీలోనే వేచి ఉన్నప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాం«దీతో కూడా భేటీ కాకుండానే ఆయన తిరుగు పయనమయ్యారు. కాగా ఈ నెల 30న ఢిల్లీలో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో అధిష్టానం సమావేశం కానుంది. శుక్రవారం మళ్లీ ఢిల్లీకి రావాలని సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అధిష్టానం సూచించింది.
ముఖ్యమంత్రి వేచి చూసినా..
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఆదివారం రాత్రి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌లు జరిపిన చర్చలకు కొనసాగింపుగా.. సోమవారం కూడా చర్చలు ఉంటాయని భావించారు. ఈ చర్చల్లో పాల్గొనేందుకే ముఖ్యమంత్రి సోమవారమంతా ఢిల్లీలో ఎవరినీ కలవకుండా వేచిచూశారు. అయితే సోమవారం సాయంత్రం 5 గంటలకు రాహుల్‌గాంధీతో సమావేశమైన కేసీ వేణుగోపాల్.. ఆదివారం రాత్రి సీఎం, పీసీసీ అధ్యక్షుడితో జరిపిన చర్చల సారాంశాన్ని వివరించారు.
ముఖ్యమంత్రి అభిప్రాయాలను సైతం వెల్లడించారు. ఈ భేటీ కొనసాగుతున్న సమయంలోనే రాహుల్ కార్యాలయం నుంచి మహేశ్‌గౌడ్‌కు పిలుపు రావడంతో ఆయన వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్‌ని కలిశారు. ఈ సందర్భంగానే మహేశ్‌గౌడ్ మంత్రి పదవులు ఆశిస్తున్న వారి వివరాలను, పార్టీతో వారికి ఉన్న అనుబంధం, సీనియారిటీ, సామాజిక సమీకరణాలతో కూడిన ఒక నివేదికను రాహుల్ గాం«దీకి అందజేశారు. పీసీసీ కార్యవర్గ కూర్పులో ప్రాధాన్యత ఇస్తున్న వారికి సంబంధించిన వివరాలతో మరో నివేదిక ఇచ్చారు.
ఈ అన్ని అంశాలపై కేసీ వేణుగోపాల్, మహేశ్‌గౌడ్‌లతో సుమారు గంటపాటు రాహుల్ చర్చలు జరిపారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రికి కూడా పిలుపు వస్తుందని అందరూ భావించినప్పటికీ, ఈ మేరకు రేవంత్‌రెడ్డికి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే రాహుల్‌తో భేటీ అనంతరం మహేశ్‌గౌడ్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. రాహుల్‌తో చర్చల సారాంశాన్ని వివరించారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న చివరిసారిగా రాహుల్‌గాందీతో వ్యక్తిగతంగా సమావేశమైన రేవంత్‌రెడ్డి రాజకీయ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఇప్పటివరకు వారి మధ్య భేటీ జరగలేదు.
ఆ పేర్లపైనే మరోసారి చర్చ
సోమవారం రాహుల్‌తో జరిగిన సమావేశంలో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఇదివరకే గుర్తించిన పేర్లపైనే మరోమారు చర్చ జరిగినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, అమేర్ అలీఖాన్, ఫహీమ్ ఖురేïÙల పేర్లు తుది జాబితాలో ఉన్నాయి.
వీరితో పాటు మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును పరిశీలించినట్టు సమాచారం. కాగా వీరి విషయంలో ఏఐసీసీ ఆలోచనలకు, పీసీసీ ప్రతిపాదనలకు, ముఖ్యమంత్రి ఉద్దేశాలకు మధ్య వైరుధ్యం ఉందని అంటున్నారు. సామాజికవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఆశావహుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలోనే చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. అయితే ఒకరిద్దరు ఆశావహులకు మంత్రి పదవులు ఖచి్చతంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉండడం చర్చలు అసంపూర్తిగా ముగియడానికి ఒక కారణమనే వాదన కూడా వినిపిస్తోంది.
అలాగే ఒకరిద్దరి విషయంలో ఏఐసీసీ కూడా తీవ్ర పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మహేశ్‌గౌడ్ కోరుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం అంశాలపై చర్చించేందుకు ఈ నెల 30న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.