
గట్టు ప్రవీణ్ చిత్రపటం వద్ద అంజలి ఘటిస్తున్న కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు
చేసిన పనులకు ఏళ్ల తరబడి బిల్లులు రాక కష్టాల్లో కాంట్రాక్టర్లు
ముఖ్యమంత్రికి బిల్డర్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వెసులుబాటు మేరకు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఆర్థిక అంచనాలకు మించి పనులివ్వడం వల్ల, ఆ తరువాత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆదివారం రాసిన బహిరంగ లేఖలో పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సీఎం ఇటీవల వెల్లడించిన అంశాలతో ఏకీభవిస్తున్నామని తెలిపింది.
ప్రస్తుతం ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లించాలంటే ఆరేడు సంవత్సరాలు పడుతుందని పేర్కొంది. బిల్లులు రాక ఆప్పుల వాళ్ల ఒత్తిళ్లు తట్టుకోలేక చిన్నతనంలోనే కాంట్రాక్టర్లు గుండెపోటుతో మరణిస్తున్నారని బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన అసోసియేషన్ సభ్యుడు, తిరుమల కన్‌స్ట్రక్షన్స్ ఎండీ గట్టు ప్రవీణ్ (46)కు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఈ లేఖ విడుదల చేశారు.
ఇబ్బందులకు గురిచేయొద్దు
ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలో డీవీఎన్ రెడ్డి, సురేందర్ పేర్కొన్నారు. అయితే, తమను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్ అండ్ బీలో గత ప్రభుత్వంలో రూ.10 వేల కోట్ల వరకు, ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక మరో రూ.8 వేల కోట్ల పనులు ప్రారంభమయ్యాయని.. అయితే ఏ ఆర్థిక సంవత్సరంలోనూ రూ.2 వేల కోట్లకు మించి బిల్లులు చెల్లించలేదని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో ప్రస్తుతం రూ.10 వేల కోట్ల మేరకు పనులు సాగుతున్నాయని, ఆ శాఖలోనూ ఏనాడు రూ.1,200 కోట్లకు మించి బిల్లులు విడుదల కాలేదని చెప్పారు.
ఈ లెక్కన బిల్లుల కోసం తాము ఆరేడు సంవత్సరాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఎక్కడా అప్పు పుట్టడంలేదని ఆవేదన వ్యక్త చేశారు. ప్రభుత్వం ఏ సంవత్సరం ఎంత మేరకు బిల్లులు చెల్లించగలదో అంత మేరకే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. కాంట్రాక్టర్లు సుమారు మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా, పది లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారని, వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.