పాడి కౌశిక్‌రెడ్డికి రిమాండ్‌ విధింపు.. ఖమ్మం జైలుకు తరలించే యోచన | BRS MLA Padi Kaushik Reddy Arrest Remand Full Details | Sakshi
Sakshi News home page

పాడి కౌశిక్‌రెడ్డికి రిమాండ్‌ విధింపు.. ఖమ్మం జైలుకు తరలించే యోచన

Jun 21 2025 7:31 PM | Updated on Jun 21 2025 8:59 PM

BRS MLA Padi Kaushik Reddy Arrest Remand Full Details

సాక్షి, వరంగల్‌: హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy)కి కాజీపేట రైల్వే కోర్టులో చుక్కెదురైంది. గ్రానైట్‌ క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో ఆయనకు శనివారం 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ని పోలీసులు ఖమ్మం జైలుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

నాటకీయ పరిణామాల నడుమ శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను వరంగల్‌కు తరలించారు. ఎంజీఎంలో వైద్య పరీక్షల అనంతరం కౌశిక్‌ను కాజీపేట రైల్వే కోర్టుకు తరలించగా.. వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.

కేసు ఏంటంటే..
మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

సుబేదారి పీఎస్‌ వద్ద ఉద్రిక్తత
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కౌశిక్ రెడ్డి భార్య శాలిని రెడ్డి, కౌశిక్ సోదరుడు ప్రతీక్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయనను పరామర్శించేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్ తో కలిసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అలాగే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కూడా స్టేషన్ ఎదుట ఆందోళన చేయడంతో స్టేషన్ చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement