ప్రజా భవన్‌ కేసు: రహేల్‌కు రిమాండ్‌ విధింపు | BRS Ex MLA Shakeel Son Raheel Arrest In Pragathi Bhavan Car Case, Details Inside - Sakshi
Sakshi News home page

బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రహేల్‌కు రిమాండ్‌ విధింపు

Published Mon, Apr 8 2024 8:09 AM

BRS Ex MLA Shakeel Son Raheel Arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహేల్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ప్రగతి భవన్‌ వద్ద కారు ప్రమాదం కేసులో రహేల్‌ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. రహేల్‌ కోసం గత కొంత కాలంగా పోలీసులు గాలిస్తున్నారు. 

అరెస్ట్‌ అనంతరం రహేల్‌ను పోలీసులు.. జడ్జీ ఎదుట హాజరుపరిచారు. దీంతో, ఈనెల 22 వరకు రహేల్‌కు రిమాండ్‌ విధించారు. అనంతరం, రహేల్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ప్రగతి భవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రహేల్‌ దుబాయ్‌కు పారిపోయాడు. దీంతో, రహేల్‌కు ఇప్పటికే పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఈరోజు రహేల్‌ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. అయితే, ప్రగతి భవన్‌ వద్ద జరిగిన ప్రమాదంలో రహేల్‌ను తప్పించేందుకు  తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్టు చూపించారు నిందితులు. కానీ, అసలు నిందితుడు రహేల్‌గానే పోలీసులు గుర్తించారు. 

అసలేం జరిగిందంటే..
డిసెంబర్‌ 23 2023వ తేదీన తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్(ప్రస్తుత ప్రజా భవన్‌) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రగతి భవన్ వద్ద ఉన్న బారికేడ్లపైకి దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేసింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని నిందితులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్​కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు రాహేల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు తెలిసింది. అయితే పోలీస్ స్టేషన్ నుంచి అతడు తప్పించుకోవడంతో నిందితుడు కావాలనే తప్పిపోయాడా ఎవరైనా తప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అసలు నిందితుడు రహేల్‌ అని తేల్చారు.

మరో కేసులో రహేల్‌..
జూబ్లీహిల్స్‌లో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో షకీల్‌ కొడుకే రహేల్‌ కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ కేసుపై మళ్లీ దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-45లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్‌ వైపు వచ్చిన మహీంద్రా థార్‌ వాహనం రాత్రి ఎనిమిది గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ముగ్గురు మహిళలకు గాయాలు కాగా రెండు నెలల బాలుడు దుర్మరణం చెందాడు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటంతో షకీల్‌ వాహనంగా తేలింది.

అయితే అందులో తన కుమారుడు లేడని షకీల్‌ ప్రకటన ఇచ్చారు. మరోవైపు అఫ్రాన్‌ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు అఫ్రాన్‌వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మాజ్‌ అనే మరో యువకుడితో పాటు కారులో రాహిల్‌ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మలుపు తిరిగింది. తాజాగా దర్యాప్తులో ఆరోజు కారు నడిపింది రహేల్‌ అని పోలీసులు గుర్తించారు. 

మరోవైపు.. అప్పట్లో 304-B సెక్షన్ చేర్చకపోవడంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ గురించి ఆరా తీయకపోవడం లాంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రకు వెళ్లి బాధితులను నగరానికి తీసుకొచ్చి వారితోపాటు మరికొందరి వాంగ్మూలాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు డ్రైవింగ్‌ సీట్‌ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి రాహేల్‌ డ్రైవింగ్‌ సీట్లో ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. 

Advertisement
Advertisement