త్రిలింగ భూమిపై కమలం వికసించాలి | BJP National President Nitin Nabeen call to party leaders | Sakshi
Sakshi News home page

త్రిలింగ భూమిపై కమలం వికసించాలి

Jul 1 2026 4:45 AM | Updated on Jul 1 2026 4:45 AM

BJP National President Nitin Nabeen call to party leaders

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడాలి 

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది 

ఇంటింటికీ వెళ్లి వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను వివరించాలి 

ప్రజల గొంతుకగా రోడ్డెక్కితేనే మనకు అధికారం సాధ్యం 

శ్రేణులకు నితిన్‌ నబీన్‌ దిశానిర్దేశం 

సాక్షి, హైదరాబాద్‌/ఘట్‌కేసర్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ ముక్త్‌ తెలంగాణ కల సాకారం చేయాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం వెంటనే సడక్‌ సే సన్సద్‌ తక్‌ (గల్లీ నుంచి చట్టసభల దాకా) పోరుబాటకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు వికసిత్‌ భారత్, వికసిత్‌ తెలంగాణ లక్ష్యాలను వివరించాలని సూచించారు. 

తెలంగాణలో పరివర్తన, ప్రజల గొంతుకగా వారి సమస్యలపై రోడ్లపైకి వచ్చి పోరాడితేనే అధికారం సాధ్యమని.. ఈ త్రిలింగ భూమిపై కమలం వికసించేలా పోరాడాలని కోరారు. మంగళవారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ అవుషాపూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నితిన్‌ నబీన్‌.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల పాలనను తూర్పారబట్టడంతోపాటు తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 

ప్రజల సొమ్ము రాహుల్‌ యాత్రలకు..  
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ పూర్తి చేయలేదని నితిన్‌ నబీన్‌ విమర్శించారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్టు పేరిట లూటీకి తలుపులు తెరిచిందని దుయ్యబట్టారు. అవినీతి, నేరమయ రాజకీయాలకు కాంగ్రెస్‌ పార్టీ పర్యాయపదంగా మారిందని.. దేశంలోని తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌లతో చేతులు కలిపి పనిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల శ్రమతో సంపాదించిన డబ్బును ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట ఢిల్లీకి తరలిస్తోందని.. ప్రజల డబ్బును, రైతులకు ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సొమ్మును రాహుల్‌ గాంధీ విదేశీ యాత్రలకు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అదే అవినీతి, అక్రమాలను కొనసాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ లెక్కలన్నీ తేలుస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటేనని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని ప్రకటించారు. 

ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌రావు, గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌ రెడ్డి, చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమరయ్య, పార్టీ నేతలు సునీల్‌ బన్సల్, అభయ్‌ పాటిల్, రేఖా శర్మ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ తివారీ పాల్గొన్నారు. 

విభేదాలు వీడండి: సునీల్‌ బన్సల్‌ 
‘తెలంగాణలో ఫైర్‌ ఉన్నా దానిని ఎలా ఉపయోగించుకోవడమే సమస్యగా మారుతోంది. మీలో మీరు కొట్టుకుంటున్నారు. దీంతో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితిని పక్కనపెట్టి అన్ని శక్తులను ఒకే దిశలో పెట్టే ప్రక్రియ అవసరం ’అని రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగింపు సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ పేర్కొన్నట్లు సమాచారం. నేతలంతా టార్గెట్‌ తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ‘రాష్ట్రంలో బీజేపీకి మరో శుత్రువు లేదు. పార్టీలోనే ఒకరికొకరు శత్రువులు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. దీన్ని అధిగమిస్తే పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’అని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్‌ పాటిల్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

తీర్మానాలు ఇవే...
» కాంగ్రెస్‌ ముక్త్‌ తెలంగాణ కోసం రాష్ట్ర పార్టీ కృషి చేయాలని, ప్రభుత్వాన్ని గద్దె దించేలా పోరాడాలని రాష్ట్ర కార్యవర్గం రాజకీయ తీర్మానం ఆమోదించింది. 
»    నిరుద్యోగ భృతి చెల్లించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని మరో తీర్మానం. 
»   రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతుల పక్షాన పోరాడాలని వ్యవసాయ రంగ తీర్మానం ఆమోదం. 
»  ప్రధాని మోదీ పన్నెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలను ప్రశంసిస్తూ మరో తీర్మానం. 
»  తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి ఎంతో సహకరిస్తోందని ఇంకో తీర్మానానికి ఆమోదముద్ర. 

గ్రూపులను సహించం.. కలిసి పనిచేయాల్సిందే 
పార్టీ ముఖ్య నేతలతో భేటీలో నితిన్‌ నబీన్‌ హెచ్చరిక 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడాన్ని, సమన్వయ లేమి వల్ల పార్టీలో సమస్యలు తలెత్తడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపక్షించే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. 

ఇప్పటికైనా కొందరు నేతలు పద్ధతి మార్చుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని ఆయన సూచించారని తెలిసింది. మంగళవారం రాష్ట్ర కార్యవర్గ భేటీ సందర్భంగా విడిగా ముఖ్య నేతలతో నితిన్‌ నబీన్‌ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, వైఫల్యాలు ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ నేతలంతా కలిసిమెలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పినట్లు తెలిసింది.

రేవంత్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు
ప్రజలు సిద్ధంగా ఉన్నారు: రాంచందర్‌రావు  
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో హైడ్రా పేరిట కూల్చివేతలతో సర్కార్‌ను ప్రారంభించిన రేవంత్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. మూసీ ప్రక్షాళనపై బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే గాంధీ సరోవర్‌ వంటి భారీ ప్రాజెక్టులను ప్రకటించి లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజలను నిర్వాసితులను చేయడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీకి అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 

మంగళవారం ఘట్‌కేసర్‌ సమీపంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ మనలో మనం పోరాడకుండా, విభేదించుకోకుండా ‘టీమ్‌ బీజేపీ’గా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తిచేసుకుంటున్న సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి, ప్రతి అడుగులోనూ సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాంచందర్‌రావు కృతజ్ఞతలు తెలియజేశారు. నితిన్‌ నబీన్‌ నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేస్తుందనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement