విపక్షాలను సర్కార్‌ వేధిస్తోంది 

BJP MLA Etela Rajender Comments On CM KCR  - Sakshi

కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు 

సీఎం కేసీఆర్‌ ఇకనైనా వీటిని ఆపాలి 

శాసనసభలో ఈటల రాజేందర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘విపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. దీనిని ఇకనైనా ఆపాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నా. మమ్మల్ని అవమానించడం అంటే మా ప్రజలను అవమానించడమే. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మా హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది’అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్ర ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు, ఇళ్లు, ఆస్తులు నష్టపోయిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని సూచించారు.

పొలాలు కోతకు గురయ్యాయని, ఇసుక మేటలు వేశాయని, పొలాలను బాగు చేసుకోవడానికి గతంలో సీఎం చేసిన ప్రకటన మేరకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున రైతులకు సహాయం చేయాలని ఈటల అన్నారు. పంట రుణమాఫీలో జాప్యంతో రైతులపై రూ.10 వేల కోట్ల వడ్డీల భారం పడిందని, ఎప్పటిలోగా రుణాలు మాఫీ చేస్తారో తెలపాలని కోరారు. రైతు కూలీలకూ రైతుబీమా పథకం వర్తింపజేయాలని ఆయన సూచించారు. 

సర్కారీ బడులు మూత.. 
రాష్ట్రంలో ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతోందని, ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయని ఈటల రాజేందర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్సిటీల్లో కోర్సుల ఫీజులను భారీగా పెంచారని, వాటిని తక్షణమే తగ్గించాలని కోరారు. ప్రైవేటు వర్సిటీల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కలి్పంచాలని, గెస్ట్‌ లెక్చరర్లకు 12 నెలల జీతం ఇవ్వాలని అన్నారు. 

భూముల విక్రయాలు వద్దు.. 
ప్రభుత్వ భూముల విక్రయాలపై పునరాలోచన చేయాలని ఈటల రాజేందర్‌ సూచించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల పేదలనుంచి అసైన్డ్‌ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. ఐఏఎస్‌ అధికారులకు కూడా దళితబంధు ఇస్తామనడం సరికాదని, పేదవారికి మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీ అమలు చేయాలని, డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వచ్చాక ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సొంత జాగాలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల సహాయం అందజేయాలని సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top