BJP Vs TRS: సర్కార్‌పై ‘వార్‌’టీఐ! దరఖాస్తుల ద్వారా యుద్ధానికి రాష్ట్ర బీజేపీ సిద్ధం

BJP Getting Ready Right to Information Act Applications Vs TRS Government - Sakshi

ప్రభుత్వ సమాచారం ఆధారంగా టీఆర్‌ఎస్‌ను ఎండగట్టేందుకు బీజేపీ వ్యూహం 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తుల ద్వారా యుద్ధానికి రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. ప్రభుత్వ లెక్కలు, సమాచారం ఆధారంగా సర్కారును ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు కొత్త అస్త్రాన్ని ఎంచుకుంది. సీఎం కేసీఆర్‌ చట్టసభల్లో, జిల్లా పర్యటనల్లో ఇచ్చిన హామీలు మొదలు.. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోల్లో చేసిన వాగ్దానాలు, ఆర్థిక, రెవెన్యూ, విద్య, వైద్యం, సంక్షేమ, నీటిపారుదల తదితర శాఖల్లో చేపట్టిన కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితిపై దాదాపు వంద దాకా ఆర్టీఐ దరఖాస్తులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమర్పించారు.

ఈ మేరకు సీఎంవోతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ ప్రభుత్వ శాఖల స్పెషల్‌ సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ఈ పిటిషన్లను పంపారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల స్థాయిల్లో కూడా పార్టీ జిల్లా కమిటీలు, వివిధ మోర్చాలు, రాష్ట్రస్థాయి నాయకుల ద్వారా పెద్దఎత్తున ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.   

గత నెల 28 నుంచి సంజయ్‌ దాఖలు చేసిన పిటిషన్లలో ముఖ్యమైనవి...
2014 జూన్‌న్‌2 నుంచి 2022 జూన్‌2 వరకు జిల్లా పర్యటనలు, వివిధ సమావేశాలు, సభల్లో సీఎం ఇచ్చిన హామీలేంటి? ఎన్ని నెరవేర్చారు? 
సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ, మండలిలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలేంటి? ఎన్ని నెరవేరాయి? 
ఎనిమిదేళ్లలో కేసీఆర్‌ ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చారు? 
ఎనిమిదేళ్లలో సీఎం ఎన్నిరోజులు హైదరాబాద్‌లోని అధికార నివాసంలో ఉన్నారు ? ఎన్నిరోజులు ఫామ్‌హౌజ్‌లో బసచేశారు?
2014 జూన్‌ 2 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత? ఆదాయం ఎంత? 2022 మే 30 వరకు చేసిన అప్పులెంత? వీటికి నెలకు వడ్డీ ఎంత చెల్లిస్తున్నారు?
8 ఏళ్లలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతి నిధుల భూకబ్జాలపై సీఎంకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? వీటిపై మీడియాలో వచ్చిన వార్తలు, ఫిర్యాదులపై కలెక్టర్లు, ఏసీబీ, విజిలె¯న్స్‌ ద్వారా దర్యాపు చేయించారా?
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ ఆక్రమణలపై మాజీ ఐఏఎస్‌ ఎస్‌కే సిన్హా టాస్క్‌ఫోర్స్‌ నియామక జీవో ఇప్పించండి. ఈ కమిటీపై చేసిన ఖర్చెంత? ఈ నివేదికపై తీసుకున్న చర్యలేమిటి?
ఎనిమిదేళ్లలో కొత్తగా ఎన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించారు? కొత్తగా ఎన్ని మండలాల్లో 30 పడకల ఆసుపత్రులు, ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 పడకల ఏరియా ఆసుపత్రులు ప్రారంభించారు?
గత 8 ఏళ్లలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు జారీచేసింది? ఎన్ని ఖాళీలు భర్తీచేశారు? 
ఎనిమిదేళ్లలో ఎంత మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారు?
బిస్వాల్‌ కమిటీ నివేదిక ప్రకారం వివిధ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయి? ఈ నివేదిక ఆధారంగా తీసుకున్న చర్యల నివేదిక ఇప్పించగలరు.
8 ఏళ్లలో సీఎం వివిధ రాష్ట్రాల పర్యటనలకు ఎంత ఖర్చు అయింది? వీటికి ప్రైవేట్‌ విమానాలను వినియోగించారా లేక రెగ్యులర్‌ విమానాల్లోనే ప్రయాణించారా?
ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ పొందిన జీతభత్యాలు ఎంత? 
వీటితోపాటు రైతులకు రూ.లక్ష రుణమాఫీ, బీసీలకు కేటాయించిన నిధులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎంతమందికి ఇచ్చారు, ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ, రేషన్‌ కార్డులు, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ మిల్లులకు తరలింపు, 57 ఏళ్లకు కొత్త వృద్ధాప్య పింఛన్లు, ధరణి పోర్టల్‌ సమస్యలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు, పంచాయతీలకు 8 ఏళ్లలో ఇచ్చిన నిధులు, పోడుభూముల సమస్య, తీసుకున్న చర్యలు వంటి వాటిపైనా ఆర్టీఐ పిటిషన్లు దాఖలు చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top