
జ్యోతిర్లింగ క్షేత్రాలతోపాటు అంబేడ్కర్ జన్మస్థలం సందర్శన
సాక్షి, హైదరాబాద్: జ్యోతిర్లింగ క్షేత్రాలతోపాటు అంబేడ్కర్ జన్మస్థలం, ఆయన బౌద్ధమతం స్వీకరించిన ప్రాంతాలను చుట్టివచ్చేలా ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును (Bharat Gaurav Tourist Train) ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆగస్టు 16న ప్రారంభమయ్యే ఈ రైలు టూర్ 24వ తేదీ వరకు (8 రాత్రులు– 9 రోజులు) కొనసాగుతుంది.
ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలను, నాగ్‌పూర్‌లోని శ్రీ స్వామినారాయణ మందిరం, నాసిక్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, పుణేలోని భీమశంకర్ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్‌లోని గ్రిషే్ణశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రాలతోపాటు మోవ్ వద్ద అంబేడ్కర్ జన్మస్థలం, ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్షా భూమి స్తూపం ప్రాంతాలను కూడా చుట్టి వస్తుంది.
సికింద్రాబాద్‌తోపాటు కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్ – పూర్ణ తదితర స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఆయా ప్రాంత పర్యాటకులు ఆ స్టేషన్లలోనే రైలు ఎక్కి, దిగేందుకు వీలుంటుంది. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి ఉంటుందని పేర్కొంది. పర్యాటకులకు అవసరమైన ఎస్కార్ట్ భద్రత (సీసీటీవీ కెమెరాలు సహా) ఉంటుందని వివరించింది. పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం, ప్రయాణ బీమా వసతి ఉంటుందని ఐఆర్‌సీటీసీ (IRCTC) తెలిపింది.
డబుల్/ట్రిపుల్ షేర్ టికెట్ ధరలు
స్లీపర్ రూ. 14,700 (నాన్ ఏసీ హోటల్ గది – షేరింగ్), 3 ఏసీ రూ. 22,900 (ఏసీ హోటల్ గది – షేరింగ్), 2 ఏసీ రూ. 29,900 (ఏసీ హోటల్ గది నాన్ షేరింగ్), పిల్లల(5–11 వయసు)కు స్లీపర్ రూ.13,700, 3 ఏసీ రూ. 21,700, 2ఏసీ రూ. 28,400 బుకింగ్ కోసం: 9701360701, 9281030712, 9281030711 నంబర్లలో.. ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్: www.irctctourism.comను సందర్శించవవచ్చని ఐఆర్‌సీటీసీ సూచించింది.
చదవండి: హైదరాబాద్‌లో పెరుగుతున్న e వ్యర్థాలు