తల్లిపాలు: మొదటి మూడురోజుల్లో వచ్చే పాలలో ఔషధ గుణాలు..

The Benefits of Breast Feeding For Mom And Baby - Sakshi

సాక్షి,  బన్సీలాల్‌పేట్‌ (హైదరాబాద్‌): తల్లిపాలు పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పలువురు వక్తలు అన్నారు. బోయిగూడ మల్టీ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్‌ కె.హేమలత, గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ మహాలక్ష్మి, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బి.విద్యులత, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ శ్రీకాంత్‌ మాట్లాడారు. తల్లిపాలు బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి నృత్యరూపకం, నాటకాలు, ఉపన్యాసాల ద్వారా గర్భిణులు, బాలింతలకు వివరించారు.  ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు పండ్లు, గాజులు, పువ్వులు తదితరాలను అందజేశారు. 

తల్లిపాలలో ఔషధ గుణాలు..
సనత్‌నగర్‌: తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం సనత్‌నగర్‌ అల్లావుద్దీన్‌ కోఠి–2, బల్కంపేట–ఇందిరాగాంధీ పురం అంగన్‌వాడీ సెంటర్లలో తల్లిపాల విశిష్టతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయా సెంటర్ల అంగన్‌వాడీ టీచర్లు హాజరై తల్లులకు, మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రసవం సాధారణంగా జరిగినా, శస్త్ర చికిత్స ద్వారా జరిగినా గంట లోపు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ప్రసవానంతరం మొదటి మూడు రోజుల్లో వచ్చే పాలలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, బిడ్డకు ఉదర కోశ వ్యాధులు, న్యూమోనియా వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయని చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లు ప్రవీణదేవి, శోభారాణి, బబిత, ఏఎన్‌ఎం అనురాధ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top