
అభివాదం చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్, ఈశ్వరయ్యగౌడ్, చిరంజీవులు, విశారదన్ తదితరులు
పోరాటాలు రచించాలి.. పదునెక్కిన తీర్మానాలు చేయాలి
మనకోసం మనం పోరాటాలు చేయక తప్పదు
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు – న్యాయ వివాదాలు పరిష్కారం.. బీసీ సంఘాల సమాలోచన సమావేశంలో వక్తలు
సాక్షి, హైదరాబాద్: ‘బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి. పదు నెక్కిన తీర్మానాలు రచించాలి. ఇదేదో ఒక్కరిద్దరి కోసం కాదు. యావత్తు తెలంగాణ బీసీల భవిష్యత్ అని గుర్తించా లి. ప్రతి ఒక్కరు యుద్ధవీరులు కావాలి. ఇప్పటి వరకు ఇతరుల కోసం పోరాటాలు చేశాం. ఇప్పుడు మన కోసం పోరాటాలు చేయక తప్పదు. పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరు కదలివస్తేనే మన హక్కులను సాధించుకుంటాం. భూకంపం సృష్టిస్తేనే.. ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఇవ్వా ల్సిన బీజేపీ ఇవ్వడం లేదు.
పోరాడాల్సిన కాంగ్రెస్ పోరాటం చేయడం లేదు. నిరసనలు చేస్తామన్న బీఆర్‌ఎస్ పట్టించుకోవడం లేదు. కేవలం బీసీల ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ ఎత్తుగడలు చేస్తున్నాయి. అన్నీ ఉన్న మనం మన రిజర్వేషన్లు ఎందుకు సాధించుకోలేకపోతున్నాం. ఇదే చిట్ట చివరి అవకాశం. ఒక తెలంగాణ కోసం పోరాటం చేస్తేనే ఇన్ని వచ్చాయి. రిజర్వేషన్లు అమలైతే దానికి రెట్టింపు ఫలితాలు పొందుతాం అని బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం కోరింది. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ‘బీసీలకు 42శాతం రిజర్వేషన్లు– న్యాయ వివాదాలు పరిష్కారం’పై బీసీ సంఘాల సమాలోచన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఓబీసీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వ రయ్యగౌడ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ చైర్మన్ డా.విశారదన్ మహరాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్‌తోపాటు అనేక బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
⇒ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు నిరాహారదీక్ష చేయడానిౖనా సిద్ధమన్నారు. బీఆర్‌ఎస్ పరంగా మద్దతు ఇస్తామని చెప్పారు.
⇒ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు పోరాటం చేయాలన్నారు. యుద్ధం ఆపేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీ జాతిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. క్రెడిట్ అంతా మాకే రావాలని రెండు బిల్లులు చేసి పంపిన కాంగ్రెస్.. దాని అమలు కోసం చిత్తశుద్ధి ఏది అని ప్రశ్నించారు. హైకోర్టు జడ్జిమెంట్ రాక ముందే ప్లాన్‌ఆప్ యాక్షన్ చేసుకోవాలని హితవు పలికారు.
⇒ చిరంజీవులు మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామన్న బీఆర్‌ఎస్ ఏమీ చేయడం లేదని, బీసీల ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఒక్కరిద్దరు మాత్రమే రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్నట్టుగా రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయాలన్నారు.
⇒ విశారదన్ మాట్లాడుతూ రేవంత్ తన గెలుపు కోసం 420 హామీలు ఇచ్చారని, అందులో బీసీ రిజర్వేషన్లు అనే ఒక ఆయుధంతో బీసీలను ఆటాడిస్తున్నారన్నారు. తనకు ఇష్టం వచ్చినట్టు ఆ ఆయుధాన్ని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిల మీదే ఉందని, అవి అమలు కాకపోతే వారిద్దరని సంఘ బహిష్కరణ చేయాలన్నారు.