ఇదిగోనమ్మా.. రుణం తీసుకో.. | Bank Linkages Schemes Loans For Women Societies | Sakshi
Sakshi News home page

ఇదిగోనమ్మా.. రుణం తీసుకో..

Dec 13 2020 9:55 AM | Updated on Dec 13 2020 9:58 AM

Bank Linkages Schemes Loans For Women Societies - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ పథకం కింద ఇచ్చే రుణాల మంజూరు లక్ష్యాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి సుమారు 32 శాతం అధిక మొత్తంలో రుణాలివ్వాలని నిర్ణయించింది. నిర్దేశించిన లక్ష్యం భారీగా ఉండటంతో మహిళా సంఘాలకు రుణాలిప్పించేందుకు క్షేత్రస్థాయిలోని ఐకేపీ సిబ్బంది తంటాలు పడుతున్నారు. ‘రుణం తీసుకోండమ్మా..’ అంటూ స్వయం సహాయక సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణాలు మంజూరు చేస్తోంది. సీసీఎల్‌ లోన్లు, టర్మ్‌ లోన్లు ఇలా రెండు రకాల రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిస్తారు. ఆయా సంఘాలు ప్రతినెలా పొదుపు చేసుకుని.. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించిన సంఘాలకు వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీని ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. 
ఒక్కో సభ్యురాలికి 

రూ.లక్ష వరకు రుణం
రుణ మంజూరు లక్ష్యం భారీగా పెరగడంతో ఒక్కో సభ్యురాలికి సుమారు లక్ష రూపాయల వరకు రుణం మంజూరవుతోంది. గతంలో రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు అంతకు రెట్టింపు పెంచారు. దీంతో మహిళలు ఉత్సాహంగా రుణాలు తీసుకుంటున్నా.. తిరిగి చెల్లింపు విషయంలో ఒకింత ఆందోళన చెందుతున్నారు. పెద్ద మొత్తంలో రుణం తీసుకుని చెల్లించకపోతే, రానున్న రోజుల్లో రుణానికి అర్హత కోల్పోతామని భావిస్తున్నారు. రుణాల ఊబిలో కూరుకుపోతే ఇబ్బందిపడాల్సి వస్తుందని కలవరం చెందుతున్నారు.

టంచనుగా రీపేమెంట్‌
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలు టంచనుగా వసూలవుతున్నాయి. రికవరీ రేటు 98 శాతం వరకు ఉండటంతో బ్యాంకర్లు పెద్దగా తిరకాసు పెట్టకుండానే రుణాలిచ్చేస్తున్నారు. ఏదైనా కారణంతో సంఘంలోని ఒక మహిళ తన రుణాన్ని తిరిగి చెల్లించకుంటే సంఘంలోని మిగితా సభ్యులే చెల్లించి, ఆ మొత్తాన్ని తర్వాత వసూలు చేసుకుంటున్నారు. దీంతో రుణాలపై రీపేమెంట్‌ ఇబ్బందులు లేకుండా పోయాయి.

కరోనా కష్టాల నుంచి గట్టెక్కించేందుకు..
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. లాక్‌డౌన్‌తో పలువురు ఉపాధి కోల్పోయారు. ఇలాంటి తరుణంలో మహిళల కొనుగోలు శక్తిని పెంచేందుకు రుణ మంజూరు లక్ష్యాన్ని ప్రభుత్వం పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర కీలకం కావడంతో వారికి విరివిగా రుణాలివ్వడం ద్వారా గ్రామీణార్థిక వ్యవస్థ గాడిన పడుతుందంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement