కావాలనే అలా మాట్లాడా! నేరం ఒప్పుకోలు.. భైరి నరేష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు

Bairi Naresh Remand Report Reveals Intentionally He Made Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అయ్యప్ప స్వామి పుట్టుకను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌.. ఉద్దేశ్యపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌ ద్వారా తేలింది. 

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలతో హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారుల ఆగ్రహానికి గురయ్యాడు ఓయూ స్టూడెంట్‌ భైరి నరేష్‌. అయితే కేసులు నమోదు కావడంతో అతన్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ఇక రిమాండ్‌లో ఉన్న భైరి నరేష్‌ పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్నాడు. కావాలనే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడతను. అలాగే.. నరేష్‌ను తాను ఉద్దేశ్యపూర్వకంగానే ఆ కార్యక్రమానికి పిలిచినట్లు మరో నిందితుడు, సభను నిర్వహించిన హనుమంతు పోలీసుల ఎదుట స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

మరోవైపు భైరి నరేష్‌పై గతంలోనూ పలు కేసులు నమోదు అయ్యాయని కొడంగల్‌ పోలీసులు కోర్టుకు వెల్లడించినట్లు రిమాండ్‌ కాపీలో ఉంది. మత విద్వేషాలకు పాల్పడే ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశాడని పోలీసులు కొడంగల్‌ స్థానిక కోర్టుకు తెలిపారు. హనుమకొండలో రెండు, నవాబ్‌పేట పోలీస్‌ స్టేషన్‌లోనూ భైరి నరేష్‌పై కేసులు ఉన్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. ప్రస్తుత కేసుపై అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

డిసెంబర్‌19వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కొడంగల్‌లో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంలో ప్రసంగించిన భైరి నరేష్‌ ఈ క్రమంలోనే హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఉమాపతి గౌడ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు పోలీసులు. 

సాక్షి  చేతిలో బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top