
మీడియాతో మాట్లాడుతున్న ఈశ్వర్‌రావు. చిత్రంలో వజీర్, నాగరాజు తదితరులు
15 రోజుల్లో సమస్య పరిష్కరించేందుకు డిస్కంల హామీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ భద్రత కల్పించాలని..అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 నుంచి చేపట్టాలని భావించిన నిరవధిక సమ్మెను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ కన్వర్షన్ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఆ సంఘం చైర్మన్ ఈశ్వర్‌రావు, కనీ్వనర్ వజీర్, కోచైర్మన్ గాంబో నాగరాజులు మింట్‌కాంపౌండ్‌లో సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
విద్యుత్ సంస్థల యాజమాన్యాల నుంచి సానుకూల ప్రకటన రావడం, విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు సృష్టించొద్దనే ఆలోచనతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఆర్టిజన్లను కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడబోదన్నారు. అయితే తమ సమ్మె నోటీసులపై విద్యుత్ సంస్థల సీఎండీలు స్పందించి, ప్రభుత్వంతో మాట్లాడేందుకు 15 రోజుల సమయం కావాలని కార్మికశాఖను కోరినట్టు తెలిపారు. కార్మికశాఖ అధికారి హామీ మేరకు తాత్కాలికంగా నిరవధిక సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో నరేందర్, లింగం, కోటి పాల్గొన్నారు.