ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఎస్‌ఐ ప్లాన్‌ తెలిసి పోలీసు శాఖలో టెన్షన్‌!

AR SI Danger Plan To Kill Constable In Mulugu District - Sakshi

డిపార్ట్‌మెంట్‌లో మెప్పు కోసం ఓ పోలీస్‌ పక్కా స్కెచ్‌ 

ములుగు కేంద్రంగా సాయుధ దళం ఏర్పాటుకు ప్రణాళిక 

వారితో యాక్షన్లు చేయించి.. తర్వాత ఎన్‌కౌంటర్‌ చేయాలని కుట్ర 

అమలుకు ముందే భగ్నం చేసిన హైదరాబాద్‌ పోలీస్‌ నిఘా విభాగం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్‌ శాఖ చర్యలు చేపడుతుండగా.. అదేశాఖలో పనిచేసే ఓ అధికారి మావోయిస్టుల తరహాలో దళాన్ని ఏర్పాటు చేసేందుకు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. తాడ్వాయి అడవుల్లో ట్రయల్‌ కూడా నిర్వహించినట్లు సమాచారం. సదరు వ్యక్తులు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. వరంగల్‌లో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపించి మావోయిస్టులు ఉన్నారనే భ్రమ కల్పించాలని పక్కా స్కెచ్‌ వేసినట్లు సమాచారం. 

ఈ కుట్ర వెనుక ములుగు జిల్లాలో పనిచేసే ఓ ఏఆర్‌ ఎస్‌ఐ కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పకడ్బందీగా జరిగిన ఈ కుట్రకోణాన్ని పసిగట్టిన హైదరాబాద్‌లోని పోలీస్‌ నిఘా విభాగం.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారాలతో కూడిన కొన్ని వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ మేరకు ములుగు పోలీస్‌ అధికారుల సహకారంతో రంగంలోకి దిగిన స్పెషల్‌ ఇన్విస్టిగేషన్‌ బృందం.. సదరు ఏఆర్‌ ఎస్‌ఐతో పాటు మరో ఇద్దరిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. 

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..
ఈ విచారణలో సాయుధ దళం ఏర్పాటుతోపాటు వరంగల్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ హత్యకు సంబంధించిన వివరాలను సేకరించి.. సదరు హెడ్‌కానిస్టేబుల్‌ను సైతం అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా ఈ కుట్రకోణం వెనుక భారీ ప్రణాళిక దాగి ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. సాయుధ దళం ఏర్పాటు చేసి.. ఆ సభ్యులతో యాక్షన్లు చేయించి.. తిరిగి వారిని ఎన్‌కౌంటర్‌ పేరిట హతమార్చి పోలీస్‌శాఖలోనూ పేరు తెచ్చుకోవాలన్న మరో కోణం దాగి ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది.

వరంగల్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపే యాక్షన్‌టీమ్‌ తనను కలిసేందుకు ములుగు ప్రాంతానికి వచ్చే క్రమంలో ఎన్‌కౌంటర్‌ చేయాలన్న కుట్ర పన్నినట్లు సమాచారం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు.. ఇటు హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపి మావోయిస్టులు ఉన్నట్లు భ్రమలు కల్పించడంతోపాటు మరోవైపు ఎన్‌కౌంటర్‌ చేసి పోలీసు అధికారులు మెప్పు పొందవచ్చని భావించి ఈ కుట్రకు తెర లేపినట్లు సమాచారం. ముందే ఈ వివరాలన్నీ సేకరించి విచారిస్తున్న ప్రత్యేక నిఘా విభాగం.. వీటన్నింటిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top