అజారుద్దీన్‌ వ్యాఖ్యలపై అపెక్స్‌ కౌన్సిల్‌ కౌంటర్‌

Apex Council File Counter On Azharuddin Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ మధ్య హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఎ) వ్యవహారాలలో గొడవలు తార స్థాయికి చేరాయి. తాజాగా అజారుద్దీన్‌ వ్యాఖ్యలపై అపెక్స్‌ కౌన్సిల్‌ కౌంటర్‌ ఇచ్చింది. లోధా సిఫార్సుల నిబంధనల మేరకే అజారుద్దీన్‌కు నోటీసులు జారీ చేసినట్లు కౌన్సిల్‌ పేర్కొంది.

అపెక్స్‌ కౌన్సిల్‌లోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులకు నోటీసు పంపినట్లు తెలిపారు. ఈరోజు(గురువారం) నుంచి అజారుద్దీన్‌ హెచ్‌సీఏ అధ్యక్షుడు కాదని  అపెక్స్ కౌన్సిల్‌ పేర్కొంది. హెచ్‌సీఏ వ్యవహారాల్లో బీసీసీఐ జోక్యం ఉండదని అపెక్స్‌ కౌన్సిల్‌ వివరించింది. కాగా నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అజహర్‌పై హెచ్‌సీఏ చర్య తీసుకుంది.

సభ్యత్వం రద్దు చేసే హక్కు లేదు!
అపెక్స్‌ కౌన్సిల్‌లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారని అజారుద్దీన్‌ ఆరోపించారు. తన సభ్యత్వం రద్దు చేసే హక్కు వారికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ల అవినీతి బయటపడుతుందనే తనపై ఆరోపణలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రెసిడెంట్‌ లేకుండా మీటింగ్‌లు ఎలా పెడతారు? అని అపెక్స్‌ కౌన్సిల్‌ను అజారుద్దీన్‌ ప్రశ్నించారు. అంబుడ్స్‌మన్‌ నియామకం సరైనదేనని హైకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. 25 ఏళ్లుగా అదే వ్యక్తులు హెచ్‌సీఎలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఎవరినీ రానివ్వరు.. వచ్చినా ఉండనివ్వరు.. బ్లాక్‌మెయిల్‌ చేస్తారు.. అంటూ నిరసన వ్యక్తం చేశారు.

చదవండి: వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు: అజారుద్దీన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top